కలం, వెబ్ డెస్క్ : పంజాబ్‌లోని లూథియానా రైల్వే స్టేషన్ (Ludhiana Railway Station)లో శనివారం ఊహించని రైలు ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 వద్ద నిలిచి ఉన్న ఢిల్లీ-శ్రీ వైష్ణో దేవి కత్రా స్పెషల్ రైలుకు సంబంధించిన ఒక కోచ్ ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఈ ఘటనతో రైల్వే సిబ్బందితో పాటు ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దెబ్బతిన్న రైలు బోగీని వారు పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై రైల్వే సాంకేతిక బృందం విచారణ చేపట్టింది. కోచ్ విడిపోయిన సమయంలో ప్రయాణికుల భద్రతకు సంబంధించిన పూర్తి వివరాలు, ఈ ప్రమాదం వల్ల రైళ్ల రాకపోకలకు కలిగిన అంతరాయంపై అధికారులు నివేదిక సేకరిస్తున్నారు.

