లోక్ అదాలత్ తీర్పే ఫైనల్

కలం/ఖమ్మం బ్యూరో: లోక్ అదాలత్ (Lok Adalat) తీర్పు సుప్రీంకోర్టు తుది తీర్పుతో సమానమని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్ తెలిపారు. శనివారం జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్‌లో జాతీయ లోక్‌అదాలత్‌ను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, లోక్ అదాలత్‌లో రాజీ పడటం వలన ఇరువర్గాలు గెలిచినట్లేనన్నారు. లోక్ అదాలత్‌లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోని త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవాలన్నారు. రాజీ మార్గంలో కక్షిదారులు లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకొని తమ కేసులను శాంతియుతంగా పరిష్కరించు కోవాలని కోరారు. కేసులను రాజీతో ముగించేందుకు ఇలాంటి లోక్ అదాలత్‌లు ఉపయోగ పడతాయన్నారు. ఎలాంటి ఫీజు లేకుండా న్యాయసేవా సంస్థ సహకారంతో కేసులను పూర్తి చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

గత లోక్ అదాలత్‌లో 8490 కేసుల పరిష్కారం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా 6వ స్థానంలో నిలిచిందన్నారు. ఇందులో 63 మోటారు వాహన ప్రమాదాల కేసులు పరిష్కరించి, రూ. 4 కోట్ల 28 లక్షల 98 వేల రూపాయలు పరిహారం అందించామని ప్రధాన నాయమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుత లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో జిల్లా ఇంకా మెరుగైన స్థానం సాధించాలని ఆశా భావం వ్యక్తం చేశారు.

క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ఆస్తి విభజన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాదం, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులు, ఇతర రాజీపడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని ప్రధాన న్యాయమూర్తి పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, భేషజాలకు పోకుండా, ఇరువర్గాల గెలుపు లోక్‌అదాలత్‌లో ఉంటుందని అన్నారు. పగ, ద్వేషం, కక్ష, ప్రతీకారం ఉంచుకోవద్దని, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని, శత్రువునైనా ప్రేమించే తత్వం అలవర్చుకోవాలని తెలిపారు. లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>