కలం, వెబ్‌డెస్క్ : ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద సంస్థగా అవతరించిన గూగుల్ కంపెనీ (Google) ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభమైందో తెలుసా?.. దీని వెనక ఎన్నేండ్ల శ్రమ ఉన్నదో తెలుసా?.. దీన్ని ఎవరు ఎలా మొదలుపెట్టారో తెలుసా?… స్టార్టప్ గా ప్రారంభించినప్పుడు వారు ఎలాంటి కలలుగన్నారో తెలుసా?.. ఈ రోజు ఈ స్థాయికి వస్తుందని వారు ఊహించారా?.. ఇప్పుడు ప్రపంచాన్నే శాసిస్తున్న గూగుల్ ప్రస్థానాన్ని తెలుసుకుందాం..
గూగుల్ తొలి అడుగు…
1995లో ఇద్దరి పరిచయం ప్రపంచ టెక్ రంగ ముఖచిత్రాన్ని మార్చింది. గూగుల్ (Google) వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీబ్రిన్ మొట్ట మొదటిసారి స్టాన్‌ఫోర్ట్ విశ్వవిద్యాలయంలో కలుసుకున్నారు. తరువాత వెబ్ పేజీలను అభివృద్ధి చేసే క్రమంలో వారికి స్నేహం ఏర్పడింది. మొదటగా వారి ప్రయోగాలను హాస్టల్ లోనే ప్రారంభించారు. కానీ, ప్రాజెక్టు విస్తరించడంతో పెద్ద స్థలం అవసరం వచ్చింది. దీంతో 1998లో సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు ఆండీ బెచ్టోల్ షీమ్ నుంచి లక్ష డాలర్లు పెట్టుబడి పెట్టడంతో తమ స్టార్టప్‌ను కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ ప్రాంతంలోని ఒక ఇంటి గ్యారేజ్‌కు మార్చారు. గ్యారేజ్‌లో కంప్యూటర్లు, పింగ్ – పాంగ్ టేబుల్లు ఉండడంతో చిన్న స్టార్టప్ కేంద్రంగా మారింది. ఇక్కడే పేజ్, బ్రిన్ తమ సెర్చ్ ఇంజిన్ అభివృద్ధికి వేగం పెంచారు.
ప్రారంభించిన కొద్ది రోజులకే పెట్టుబడిదారులను ఆకర్షించిన గూగుల్.. 25 మిలియన్ వెంచర్ క్యాపిటల్ నిధులను సమకూర్చుకుంది. దీంతో ఎనిమిది మంది ఉద్యోగులను చేర్చుకుని తమ ఆఫీస్ ను పాలో ఆల్టోలోని కార్యాలయానికి మార్చారు. అయితే, ఆ స్థలం కూడా సరిపోవకపోవడంతో ఏడాదిలోపే సంస్థ ప్రధాన కార్యాలయాన్ని మౌంటెన్ వ్యూకు షిఫ్ట్ చేశారు. ఇక్కడ ప్రస్తుతం కూడా గూగుల్ తమ కార్యకలాపాలను కొనసాగించడం విశేషం.
గూగుల్ మొదటి పేరు..
గూగుల్ కు మొదటి పేరు ‘బ్యాక్‌రబ్’ .. తరువాత గణితపదమైన ‘గూగోల్’ ఆధారంగా గూగుల్ గా మార్చారు. అలాగే, లారీ పేజ్, సెర్గీబ్రిన్ కు ఆఫీస్ కోసం గ్యారేజ్ ఇచ్చిన యజమాని సుసాన్ వోజ్ సికి గూగుల్ లో ఉద్యోగిగా చేరారు. తరువాత యూట్యూబ్ సీఈవో పదవి చేపట్టారు. నిజానికి గూగుల్ స్థాపించిన రోజు సెప్టెంబర్ 4వ తేదీ. అయితే, సెప్టెంబర్ 27న గూగుల్ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది.
నేడు బిలియన్ల మంది గూగుల్ సెర్చ్ ఇంజిన్ ను మాత్రమే కాకుండా అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్ గా గూగుల్ నిలిచింది. ఇలా నిలవడం యాదృచ్చికం మాత్రం కాదు. ఎన్నో రోజుల తపన, కష్టం, అంకితభావం అన్నింటికి మించి నమ్మకం.. ఇవన్ని కలిసి గూగుల్ ను ప్రపంచ వేదికపై ఉన్నతంగా నిలబెట్టింది.
Read Also: ఇండిగో ఎఫెక్ట్.. డ్యూటీ టైమింగ్స్ మార్చాలంటున్న రైల్వే లోకో పైలట్స్
Follow Us On: Youtube


