కలం, కరీంనగర్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) పోటీ చేద్దామని భావిస్తున్న అభ్యర్థులకు మరి పార్టీ టికెట్ వస్తుందా? లేదా? ఒకవేళ పార్టీ టికెట్ రాకుంటే ఎలా? ఏం చేద్దాం? గతంలో మాదిరిగానే సింహంపై స్వారీ చేద్దాం.. అనే చర్చ జోరుగా సాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన పలువురు విజయం సాధించారు. ఈసారి పార్టీ టికెట్ రాకుంటే, ఓటర్లకు ఒక్కసారి చెబితే గుర్తుండే సింహం గుర్తుపై పోటీ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి పోటీ చేయడానికి ఆశావహులు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తే గుర్తు గురించి ఓటర్లకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎన్నికల అధికారులు ఏ గుర్తు కేటాయిస్తారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి రెబల్ గా పోటీ చేసిన పలువురు అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) పార్టీ బీ-ఫామ్ పొంది బరిలో నిలిచారు. ఈ పార్టీకి ఎన్నికల సంఘం సింహం గుర్తు కేటాయించడంతో, టికెట్ రాని ఆశావహులు సింహం గుర్తును ఎంచుకోవడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాధారణం అయింది.
గతంలో మెజార్టీ స్థానాలు..
2018 శాసనసభ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించిన కోరుకంటి చందర్ కు టికెట్ రాకపోవడంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) పార్టీ గుర్తుపై పోటీ చేసి, టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణపై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కోరుకంటి చందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరి తన పదవీ కాలం మొత్తం బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా కొనసాగారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై పోటీ చేసిన చందర్ ఓటమి చవిచూశారు.
గత మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు తొమ్మిది మున్సిపాలిటీల్లో ఏఐఎఫ్బీ పార్టీ తరఫున బరిలో నిలిచిన పలువురు విజయం సాధించారు. ఇందులో రామగుండం కార్పొరేషన్ పరిధిలో తొమ్మిది మంది కార్పొరేటర్లు విజయం సాధించగా, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ముగ్గురు, చొప్పదండి, పెద్దపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఒక్కొక్కరు చొప్పున విజయం సాధించారు.
ముందుగానే దరఖాస్తులు..
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పలువురు అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీల టికెట్ వస్తుందో లేదో క్లారిటీ లేకపోవడంతో ఏఐఎఫ్బీ పార్టీకి దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఎవరికీ తెలియకుండా పార్టీ సభ్యత్వాలు సైతం తీసుకుంటున్నారు. రిజర్వేషన్లు ఖరారు అయిన తరువాత, ప్రస్తుతం ఉన్న పార్టీలో టికెట్ రాకుంటే సింహం గుర్తుపై పోటీకి సన్నద్ధమవుతున్నారు.
Read Also: వృద్ధులను ఆదుకుంటాం : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp


