కలం, తెలంగాణ బ్యూరో : “సచివాలయం (Telangana Secretariat) లేకపోతే పరిపాలన చేయలేం… గతంలో సచివాలయం ఉండేది కాదు. కట్టగానే నేను వచ్చిన… అందుకే ఇప్పుడు పరిపాలన జరుగుతున్నది…” అని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం కామెంట్ చేశారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చేవారే కాదని తీవ్ర స్థాయిలోనే విమర్శలు ఉన్నాయి. దానికి కౌంటర్‌గా అప్పటి మంత్రులు సైతం “సీఎం ఎక్కడుంటే అక్కడే సచివాలయం” అని కౌంటర్ ఇచ్చేవారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో రెగ్యులర్‌గా సచివాలయానికి వచ్చేవారు. కానీ ఆ తర్వాత ఆ ఒరవడి అటకెక్కింది. క్యాబినెట్ మీటింగులకు, ముఖ్యమైన ప్రతినిధులను కలవాలనుకునేటప్పుడు, కలెక్టర్ల కాన్ఫరెన్సులు, ప్రభుత్వపరంగా స్కీమ్‌లు లేదా అభివృద్ధి పనులను ప్రారంభించాలనుకున్నప్పుడు మాత్రమే వస్తున్నారు. గత కొన్ని నెలలుగా సెక్రటేరియట్ కారిడార్లలో జరుగుతున్న చర్చ.
రివ్యూలన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోనే :
సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంకంటే కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోనే ఎక్కువగా రివ్యూలు, సమావేశాలు జరుపుతున్నారు. శాఖాపరమైన సమావేశాలు, కీలకమైన భేటీలు.. ఇలాంటివన్నీ అక్కడే జరుగుతున్నాయి. నిర్దిష్టంగా ఒక్కో అంశానికి సంబంధించినదో లేదా ఒక శాఖకు మాత్రమే పరిమితమైనదో అయినప్పుడు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలోనే సమీక్షలు జరుగుతున్నాయి. చీఫ్ సెక్రటరీ మొదలు కీలకమైన శాఖల అధికారులు సైతం సీఎంతో చర్చించడానికి అక్కడికే వెళ్తున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంగా జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో ఏర్పాటు చేసుకోవాలని తొలుత భావించినా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో చిన్న స్థలమే అయినా నివాసంలోనే అధికారులతో సమావేశమవుతున్నారు.
ఎమ్మెల్యేలు కలిసేందుకు ఇబ్బందులు :
ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్ళి కలవడానికి ఎమ్మెల్యేలు తటపటాయిస్తున్నారు. ఇంటి దగ్గర కలవాలంటే ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో వెళ్ళాల్సి వస్తుందని, ఆయన ప్రైవసీకి ఇబ్బంది కలుగుతుందనేది ఇందుకు ప్రధాన కారణం. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అక్కడకు వెళ్ళడానికి అలవాటుపడ్డారు. సమీక్షా సమావేశాలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరుగుతుండడంతో బిజీగా ఉంటారని, సమయం దొరకకపోవచ్చని భావిస్తున్నారు. దీనికి తోడు యాక్సెస్ కోసం పోలీసులపై ఆధారపడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ముందుగా ఏర్పాట్లు చేసుకోవడంలోని సమస్యలను ఏకరువు పెడుతున్నారు. అందుకే అక్కడకు వెళ్ళి కలవాలంటే ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వస్తున్నదని పేర్కొన్నారు.
సచివాలయమే బెస్ట్ ప్లేస్ :
ముఖ్యమంత్రి సచివాలయానికి (Telangana Secretariat) వస్తే ఎప్పుడైనా కలవడానికి అవకాశం ఉంటుందనేది ఎమ్మెల్యేల ఉద్దేశం. కానీ సీఎం సచివాలయానికి చాలా అరుదుగా మాత్రమే వస్తుండడంతో ముఖాముఖి కలిసి మాట్లాడడానికి అవకాశం దొరకడంలేదు. నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రభుత్వం నుంచి నిధుల అవసరాలు.. ఇలాంటివన్నీ స్వయంగా ఆయనకు కలిసి చెప్పుకోడానికి సచివాలయమే బెస్ట్ ప్లేస్ అనేది వారి భావన. సీఎం సచివాలయానికి రాకపోవడంపై ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు కలుగుతున్న అసౌకర్యం ఇలా ఉంటే గత ప్రభుత్వంలో అమలైన విధానమే ఇప్పుడు కూడా కొనసాగుతున్నదనే అభిప్రాయం కొద్దిమంది ఉద్యోగుల్లో నెలకొన్నది. తాజాగా సచివాలయం గురించి సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్లు చేయడంతో దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతున్న ప్రాక్టీసు చర్చకు దారితీసింది.
జీరో అవర్‌లో అంశాలే ఉదాహరణ :
ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు కలిసే అవకాశం లేకపోవడంతో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాల్సి వస్తున్నది. వంద పడకల ఆస్పత్రి నిర్మాణం, నిధుల విడుదల, మెడికల్ ఎక్విప్‌మెంట్ అవసరాలు, పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పన.. ఇలాంటి అంశాలన్నీ ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లో కనిపిస్తున్నాయి. తాజాగా ముగిసిన అసెంబ్లీ సెషన్‌లో ఒక రోజు దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన జీరో అవర్‌లో ఎక్కువ సమస్యలు అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచే వచ్చాయి. ప్రభుత్వం లేదా సంబంధిత శాఖాధికారుల దృష్టిలో ఇవి చిన్నచిన్న సమస్యలే అయినా నియోజకవర్గ స్థాయిలో ఇవి కీలకమైనవిగా ఉంటున్నాయి. సీఎం దృష్టికి తీసుకెళ్తే సంబంధిత శాఖ నుంచి క్లియరెన్స్ వస్తుందని, ఫండ్స్ రిలీజ్ అవుతాయనే ఒక భరోసా ఉంటుందన్నది ఎమ్మెల్యేల మాట.
Read Also: రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఆ నిధులు విడుదల
Follow Us On : WhatsApp


