‘సైలెంట్ కిల్లర్’ హైబీపీ.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

కలం, వెబ్‌డెస్క్: పెద్దలలో సాధారణంగా రక్తపోటు (Blood Pressure – BP) 120/80 mmHg ఉండాలి. కానీ కొంత మందికి మాత్రం ఉండాల్సిన దానికంటే రక్తపోటు అధికంగా నమోదు అవుతుంది. వైద్య మార్గదర్శకాల ప్రకారం, ఒక వ్యక్తి రక్తపోటు 130/80 mmHg లేదా అంతకంటే ఎక్కువ రీడింగ్ నమోదు అయితే దీన్ని హైబీపీ (High Blood Pressure) గా పరిగణిస్తారు వైద్యులు. అయితే ఈ అధిక రక్తపోటు వల్ల చాలా నష్టాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

హైబీపీని డాక్టర్లు ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే నెమ్మదిగా వస్తుంది. కానీ ఒకసారి పెరిగితే గుండె, మెదడు, కిడ్నీలు, రక్తనాళాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 140 కోట్ల మందికి బీపీ ఉంది. అందులో చాలా మందికి తమకు బీపీ ఉందని కూడా తెలియదు. అయితే చాలా మంది తమ రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి కేవలం మందులపైనే ఆధారపడతారు. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మందులతో పాటు చిన్నపాటి జీవనశైలి మార్పులతో కూడా హైబీపీని సహజంగా నియంత్రించవచ్చు. ఒత్తిడి, సరైన జీవనశైలి లేకపోవడం, ఊబకాయం, అధిక ఉప్పు తీసుకోవడం, కిడ్నీ సమస్యలు, మందులు లేదా స్టెరాయిడ్ల ప్రభావాలు వంటివి హైబీపీకి కొన్ని ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో వృద్ధులే కాకుండా యువతీయువకులు కూడా బీపీ బారిన పడుతున్నారు. దీనికి ముఖ్య కారణం ఆధునిక జీవనశైలిలో వచ్చిన మార్పులు. అయితే కొన్ని రకాల అలవాట్లు మనకు తెలియకుండానే బీపీ పెరుగుదలకు కారణమవుతున్నాయి. బీపీ పెంచే లైఫ్‌స్టైల్ అలవాట్లు, గుర్తించాల్సిన లక్షణాలు, నివారణ మార్గాలు గురించి నిపుణులు వివరించారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రోజంతా కూర్చొని పనిచేయడం

ఈ రోజుల్లో చాలా మంది బిజీ లైఫ్‌స్టైల్ లీడ్ చేస్తున్నారు. దీంతో శారీరక శ్రమకి దూరం అవుతున్నారు. చాలా మందికి మొదట కూర్చొనే జీవనశైలి బీపీ పెరగడానికి కారణమవుతుంది. రోజంతా డెస్క్ దగ్గర కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె బలహీనమవుతుంది. రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) రీసెర్చ్ ప్రకారం, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, పొగ తాగడం, ఎక్కువ మద్యం సేవించడం ఇవన్నీ బీపీ ప్రమాదాన్ని పెంచుతాయి.

తినే ఆహారం చూపే ప్రభావం

ఈ రోజుల్లో చాలా మంది ఏది పడితే అది తింటున్నారు. బీపీ పెరగడంలో తినే ఆహారం కూడా చాలా ప్రభావం చూపుతుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెట్ స్నాక్స్, బయట తినే ఫుడ్ ఇవన్నీ ఎక్కువ ఉప్పుతో ఉంటాయి. ఎక్కువ ఉప్పు వల్ల శరీరంలో నీరు నిల్వ అవుతుంది. దాంతో గుండె ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. అదే సమయంలో పండ్లు, కూరగాయలు, పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారం తక్కువగా తీసుకుంటే బీపీ నియంత్రణ మరింత కష్టమవుతుంది.

ఒత్తిడి వల్ల కూడా బీపీ పెరుగుతుంది

ఈ రోజుల్లో వర్క్ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. బీపీ పెరగడానికి ఒత్తిడి కూడా ఒక పెద్ద కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ఎప్పుడూ స్ట్రెస్ ఫీలయ్యేవాళ్లు, సరిగ్గా నిద్ర లేకపోవడం, ఎప్పుడూ స్క్రీన్ ముందు ఉండడం ఇవన్నీ హార్మోన్ల మార్పులకు దారితీసి తాత్కాలికంగా బీపీ పెంచుతాయి. ఆ తర్వాత అది స్థిరంగా మారే ప్రమాదం ఉంది

గుర్తించాల్సిన హెచ్చరికలు

చాలామందికి బీపీ ఉన్నా ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే రెగ్యులర్‌గా చెక్ చేయడం చాలా అవసరం. అయితే బీపీ చాలా ఎక్కువగా పెరిగితే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.

*ఉదయాన్నే తలనొప్పి రావడం
*తల తిరగడం లేదా చూపు మసకబారడం
*ఛాతీలో అసౌకర్యం
*శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
*అలసట
*ముక్కు నుంచి రక్తస్రావం
*గుండె తడబాటు
*చెవుల్లో మోగుతున్న శబ్దం

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం తీవ్రమైన బీపీ వల్ల కొందరిలో గందరగోళం, వాంతులు, తీవ్రమైన ఛాతి నొప్పి కూడా రావచ్చు. ఇవి గుండెపోటు, స్ట్రోక్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది.

చిన్న మార్పులతోనే నివారణ

సంతోషకరమైన విషయం ఏమిటంటే చిన్న చిన్న మార్పులతోనే బీపీని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చని డాక్లుర్లు సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం, ఉప్పు తగ్గించడం, శరీర బరువుని నియంత్రించుకోవడం, పొగ తాగడం మానేయడం, మద్యం తగ్గించడం, స్ట్రెస్‌ను నియంత్రించడం, సరైన నిద్ర… ఇవన్నీ బీపీ నియంత్రణలో సాయపడతాయని, రోజూ 30 నిమిషాలు వేగంగా నడవడం కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>