కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో సుమారు రూ.2 కోట్ల విలువైన 385 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్‌టీవో చెక్‌పోస్ట్ వద్ద అశ్వారావుపేట పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దుల నుండి రాజస్థాన్‌కు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రవాణాకు ఉపయోగించిన ఒక కారు, ఒక లారీని సీజ్ చేసి నిందితులపై కేసులు నమోదు చేశారు. లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి నిర్వహించిన మరో తనిఖీల్లో ఒడిశా నుంచి బెంగళూరుకు కారులో తరలిస్తున్న 85 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కారును సీజ్ చేయడంతో పాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.
15 వేల కిలోల గంజాయి స్వాధీనం..
భద్రాద్రి జిల్లాలో 2024 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 212 గంజాయి కేసులు నమోదయ్యాయి. వీటి ద్వారా పోలీసులు రికార్డు స్థాయిలో 15,398 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడిన 677 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, పట్టుబడిన ఈ గంజాయి మొత్తం విలువ మార్కెట్లో సుమారు రూ.77 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఓ వైపు గంజాయి సరఫరా చేస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతూనే.. జిల్లాలో గంజాయి సేవిస్తున్న పదిమందిని గుర్తించి, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వ్యసన విముక్తి కోసం వారిని డి-అడిక్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు.

