కలం, వెబ్ డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా వైసీపీ (YSRCP) ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలపై రాష్ట్ర వ్యాప్తంగా వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆదివారం మాజీ మంత్రి కారుమూరి సహా 38 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు కాగా, నేడు చిత్తూరులో ఎమ్మెల్సీ భరత్ సహా మరో 35 మందిపై కేసు నమోదైంది. కుప్పం (Kuppam)లో ఇటీవల చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ (MLC Bharat) సహా, వైసీపీ నేతలు తమ విధులకు ఆటంకం కలిగించారని హెడ్ కానిస్టేబుల్ చక్రపాణి కుప్పం పోలీస్ స్టేషన్ (Kuppam Police Station) లో ఫిర్యాదు చేశారు.
స్థానికంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పినా వినకుండా తమను తోసుకుంటూ వెళ్లారని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానికులను ఇబ్బందులు పెడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించాని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ భరత్ సహా మరో 35 మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు వైసీపీ నేతలు ఈ కేసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు.

