కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలోని కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) తెలిపారు. కిన్నెరసాని ప్రాజెక్టులో అటవీశాఖ ద్వారా రూ.45 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన మూడు ప్రత్యేక సఫారీ వాహనాలను, సరికొత్తగా ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై పార్కును, ఫీడ్ స్టోరేజ్ షెడ్‌ను, సీసీ రోడ్డును జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై తాము ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.
పర్యాటకులు దట్టమైన అడవిలో దాదాపు 8 కిలోమీటర్ల మేర ప్రయాణించి జింకలు, వన్యప్రాణులు, పక్షులను నేరుగా చూసేలా ప్రత్యేక సఫారీ ట్రాక్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. సందర్శకులను ఎంతగానో ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన బటర్‌ఫ్లై పార్కు, సరికొత్త సఫారీ రైడ్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని, ఇందుకు తగ్గట్లుగా అన్ని వసతులను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. వీటితో పాటు కిన్నెరసానిలోని బోటింగ్, జింకల పార్కులను మరింతగా నవీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అలాగే కిన్నెరసాని క్రాస్ రోడ్డులోని హరిత హోటల్‌కు మరిన్ని నిధులు మంజూరు చేయించి, తుదిమెరుగులు దిద్ది త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని పర్యాటక ప్రాంతాలను పక్కా ప్రణాళికలతో మరింత ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు.
కార్యక్రమం ముగిసిన అనంతరం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ అంకిత్ కలిసి కిన్నెరసాని పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జిల్లా ఫారెస్ట్ అధికారి క్రిస్ట గౌడ్, కిన్నెరసాని సర్పంచ్ వజ్ర రామకృష్ణతో పాటు సీపీఐ నాయకులు అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

