కలం, వెబ్ డెస్క్: పంచాయతీ ఎన్నికల ముంగిట సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, లింగంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య హత్యోదంతం తీవ్ర కలకలం రేపింది. ఇది పొలిటికల్ మర్డర్ గా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమని ఎదుర్కోలేక ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో నేడు లింగంపల్లి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)… మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించారు. వారికి పార్టీ అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థికసాయం అందజేశారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశమలో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. కేవలం పంచాయతీ ఎన్నికలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతలా భయపడుతోందని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో అద్భుతాలు సాధించామని, రైతు రుణమాఫీ, ఇండ్లు, రేషన్ కార్డులు ఇచ్చామని కాంగ్రెస్ ప్రకటనలు నిజమే అయితే, ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన 420 హామీలను నెరవేర్చి ఉంటే ప్రజలే స్వయంగా కాంగ్రెస్‌ను బ్రహ్మరథం పట్టేవారని, కానీ తమ వైఫల్యాల భయంతోనే కాంగ్రెస్ నాయకులు దాడులు, హింసకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
“పదేళ్ల పాటు మేము అధికారంలో ఉన్నాం.. ఎప్పుడూ మీలాంటి ఆలోచన చేయలేదు. మేము కూడా అలాంటి ఆలోచనలు చేసి ఉంటే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఇలా ఉండేదా?” అని KTR నిలదీశారు. రోజులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవని, కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఈ దిగజారుడు రాజకీయాలను విడనాడి, ప్రజల మేలుపై దృష్టి సారించాలని సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు ఇలా కొనసాగితే తాము కూడా మౌనంగా ఉండలేమని, అలా జరిగితే రాష్ట్రంలో శాంతిభద్రతలు కోల్పోయి, పరిస్థితి అదుపు తప్పుతుందని హెచ్చరించారు. తెలంగాణలో ఇలాంటి హింసాత్మక రాజకీయ సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదని, ఇది మంచి పద్ధతి కాదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
మల్లయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం…
మల్లయ్య మరణం తర్వాత వెంటనే రావాలనుకున్నప్పటికీ, ఉద్రిక్తతలు మరింత పెరగకూడదనే ఉద్దేశంతో ఆలస్యం చేసినట్లు కేటీఆర్ వివరించారు. మల్లయ్య కుటుంబానికి ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కవ్వింపు చర్యలు ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 50 శాతం సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలలో పార్టీ కార్యకర్తలు విజయం సాధించారని కొనియాడారు. ప్రజలంతా కేసీఆర్ పాలన కోసం, ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని ఆరాటపడుతున్నారని కేటీఆర్ అన్నారు.
Read Also: విశ్వనగరంలో మంచినీటి కొరత దౌర్భాగ్యం: కవిత
Follow Us On: Sharechat


