కలం, తెలంగాణ బ్యూరో : విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోతున్నాయని, తక్షణం వాటిని ప్రభుత్వం రిలీజ్ చేయాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. వివాదాస్పదమైన జీవో నెంబర్ 7ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని దశలవారీగా రద్దు చేసే కుట్రలో భాగంగానే జీవో నెంబర్ 7ను రూపొందించినట్లు కేటీఆర్ ఆరోపించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 14 లక్షల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఉన్నత విద్యకు భంగం కలిగే ప్రమాదం ఉన్నదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని మోపడమేనని ఆయన (KTR) అభివర్ణించారు.
చరిత్రాత్మకమైన ఈ పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా దాన్ని కొనసాగించారని కేటీఆర్ ఆ లేఖలో గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పథకం అమలులో నిర్లక్ష్యం పెరిగిందని విమర్శించారు. రెండున్నరేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల సర్టిఫికేట్లు కాలేజీల్లోనే నిలిచిపోయి వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడిందన్నారు. దాదాపు రూ.10,000 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయినప్పటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదన్నారు. గురుకుల విద్యాసంస్థల పరిస్థితి కూడా దిగజారిందని, విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు. విద్యా రంగాన్ని బలోపేతం చేయాల్సిన సమయంలో ఇలాంటి నిర్ణయాలు బాధాకరమన్నారు.
ప్రభుత్వం జారీచేసిన జీఓ నెంబర్ 7ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్యపై ఖర్చును ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకోవాలని, పేద విద్యార్థుల భవిష్యత్తును కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

