కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గతేడాదికంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. రెండు వారాల క్రితమే రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం హీట్ వేవ్ అలర్ట్ (Telangana Heat Wave) పేరుతో అన్ని జిల్లాలకు ముందస్తు జాగ్రత్తలు సూచించింది. నాలుగు రోజుల క్రితం హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్‌ను కూడా విడుదల చేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆరుగురు వడదెబ్బ కారణంగా చనిపోయారు. హన్మకొండ జిల్లాలో ముగ్గురు, కరీంనగర్ జిల్లాలో ఇద్దరు, గద్వాల జిల్లాలో ఒకరు చొప్పున మృతి చెందినట్లు స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగానికి సమాచారం అందింది. జిల్లాల్లోని త్రీ-మెన్ కమిటీ ఈ ఆరుగురి మృతికి దారితీసిన కారణాలను నిర్ధారణ చేయనున్నది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకుని రెవెన్యూ శాఖకు నివేదిక ఇవ్వనున్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని ప్రకటించనున్నది.
త్రీ-మెన్ కమిటీ రిపోర్టు కోసం వెయిటింగ్ :
ఈ సంవత్సరం వడదెబ్బ కారణంగా ఆరుగురు చనిపోయిన ఘటనలపై త్రీ-మెన్ కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి. వైద్యాధికారి వెల్లడించే అంశాలకు అనుగుణంగా కమిటీలోని మిగిలిన ఇద్దరు ఫీల్డ్ స్టడీ చేసి స్పష్టతకు రానున్నారు. మృతికి దారితీసిన కారణం వడదెబ్బ అవునో కాదో నిర్ధారణ చేసుకున్న తర్వాత రిపోర్టులు ఆయా జిల్లాల కలెక్టర్లకు చేరుతాయి. అందులోని అంశాలను పరిశీలించిన తర్వాత, అవసరమైతే మరోసారి కమిటీ సభ్యులతో లేదా సంబంధిత విభాగాల అధికారులతో సంప్రదింపులు జరిపి స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. ప్రస్తుతం కమిటీ స్థాయిలో ధృవీకరణ చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నట్లు స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం సిబ్బంది ద్వారా తెలిసింది. వారం రోజుల్లో ఈ ఆరుగురు వడదెబ్బ కారణంగా చనిపోయారా?.. లేక ఇతర కారణాలతోనా?.. అనే అంశంపై స్పష్టత రానున్నది.
గతేడాది ఎనిమిది మంది వడదెబ్బతో మృతి :
గతేడాది సైతం రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది వడదెబ్బ కారణంగా చనిపోయారు. ఆయా జిల్లాల్లోని కమిటీలు వీరి మృతికి దారితీసిన కారణాలను నిర్ధారించాయి. వడదెబ్బ కారణంగానే చనిపోయినట్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందలేదని జిల్లా వర్గాల సమాచారం. సచివాలయ అధికారులు నష్టపరిహారంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది. వడదెబ్బ కారణంగా మృతి చెందారనే సమాచారం వచ్చిన వెంటనే ఆయా గ్రామాలకు వెళ్ళే మండలస్థాయి త్రీ-మెన్ కమిటీ వివరాలను సేకరిస్తుంది. ఈ కమిటీలో తాసీల్దారు, మండల వైద్యాధికారి, పోలీసు ఇన్‌స్పెక్టర్ సభ్యులుగా ఉంటారు. వైద్యాధికారి ఇచ్చే నివేదికకు అనుగుణంగా కమిటీ పరిశీలన చేసి జిల్లా కలెక్టర్‌కు రిపోర్టు పంపుతుంది. దాన్ని పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వెళ్తుంది.

