కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు వారోత్సవాలు’ (Rythu Varotsavalu) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ సేవలను నేరుగా రైతుల ముంగిటకే తీసుకెళ్లేలా ఈ నెల 4 నుంచి 9 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న ’99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ప్రోగ్రామ్‌లో భాగంగా రైతుల సంక్షేమం, సేవలనుద్దేశించి రైతు వారోత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, వాటిని మరింత చేరువ చేయడానికే రైతు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. తాండూరులో రైతు వారోత్సవాలను ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ ఉత్సవాలను చేపట్టామన్నారు. అధికారులు నేరుగా రైతులతో మమేకమై వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోనున్నారని వివరించారు. చివరి రైతు వరకూ ప్రభుత్వ పథకాలు చేరవేయడం ముఖ్య ఉద్దేశమన్నారు.
బ్యాంకు లింకేజీలు, రుణాలు, టెక్నాలజీపై అవగాహన
రైతు వారోత్సవాల్లో భాగంగా ప్రతీ రైతు (Farmer) కుటుంబాన్ని వ్యవసాయ శాఖతో పాటు ఇతర విభాగాల ప్రభుత్వ సిబ్బంది సంప్రదిస్తారని మంత్రి తెలిపారు. రైతులు పండించిన ఉత్పత్తులకు మార్కెట్ లింకేజీ, బ్యాంకులు ఇచ్చే రుణాలపై సమాచార సేకరణ, రైతులకు అవసరమైన సలహాలు ఈ ప్రోగ్రామ్‌లో అందుతాయన్నారు. వ్యవసాయంలో వివిధ షవసరాలకు డ్రోన్లను వినియోగించడం, యాంత్రీకరణ ప్రదర్శనలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. సౌరశక్తి వినియోగం, పశువుల ఆరోగ్యం, చేపల ఉత్పత్తి వంటి రంగాల్లో కూడా రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వర్షాకాలానికి ముందస్తు సాగునీటి ఏర్పాట్లు చేపడుతున్నామని వెల్లడించారు. మట్టి ఆరోగ్యం, సహజ వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు మైక్రో ఇరిగేషన్‌పై రైతులకు మార్గదర్శనం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్లు నోడల్ అధికారులుగా వ్యవహరించి పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

