కలం, వెబ్ డెస్క్: మంత్రి పొంగులేటి కుటుంబ కుంభకోణాన్ని తాము బయట పెట్టే వరకు రేవంత్ సర్కార్ బిత్తర పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో శనివారం మైనింగ్ శాఖపై చర్చ సందర్భంగా హరీశ్ రావు.. రాఘవ కన్స్ట్రక్షన్ (Raghava Construction) పై సంచలన ఆరోపణలు చేశారు. సుమారు గంటపాటు అధికార, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య కోల్డ్ వార్ జరిగింది. రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తక్షణమే నైతికంగా రాజీనామా చేయాలని హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. తాజాగా ఆదివారం సైతం కేటీఆర్ ఈ ఘటనపై మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్ళేముందు కాంగ్రెస్ మంత్రుల అవినీతిపై గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ నిరసన తెలిపారు. పొంగులేటి కాదు పొంగులూటీ”, “రేవంతూ.. పొంగులేటి దోపిడీలో ఎంతున్నది నీ వంతు?”, “మైనింగ్ మాఫియాకు ప్రభుత్వ వత్తాసా.. సిగ్గు సిగ్గు”, “మంత్రుల అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి” అని పేర్కొంటూ ప్లకార్డులతో ప్రదర్శించారు.
ఈ మైనింగ్ కుంభకోణంలో ముఖ్యమంత్రి వాటా ఉన్నందుకు చర్య తీసుకోవడం లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అక్రమం జరిగింది వాస్తవమని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని అన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి దూరపు బంధువులది ముఖ్యమంత్రి అంటున్నాడని.. 2020-22 వరకు పొంగులేటే దీనికి చైర్మన్ అని పేర్కొన్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో ముఖ్యమంత్రి పొంగులేటి కంపెనీకి ఇచ్చారని మండిపడ్డారు. రెండున్నరు ఏళ్లుగా ప్రజలకు పనికివచ్చే ఒక పని కూడా సీఎం చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని.. ఆయన కుటుంబాన్ని ఎందుకు కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ మంత్రి వివేక్ సిగ్గు పడాలన్నారు. ఎన్ని కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
నగరంలోని కోకాపేట్ లో భాగ్యలక్ష్మి మైనింగ్ ముఖ్యమంత్రి బంధువులదని కేటీఆర్ (KTR) అన్నారు. రూ.వేల కోట్ల అవినీతి చేయకపోతే ఎందుకు సభను వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఆడిస్తున్నట్టు బీజేపీ ఆడుతుందన్నారు. ప్రైవేట్ భూములలో గుండాలను వేసుకొని కబ్జా చేస్తున్న దానిని కూడా తాము వదిలిపెట్టమని హెచ్చరించారు. మెట్రో పై ప్రభుత్వ స్టేట్మెంట్ చాలా తప్పుగా ఉందన్నారు. ముఖ్యమంత్రి సభలో తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ఎల్ & టీ చేతిలో ఉన్న 280 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి దండుపాళ్యం ముఠా కుట్ర చేస్తుందని ఆరోపించారు. ప్రైవేట్ సంస్థ నెత్తి మీదున్న రూ. 15 వేల కోట్ల అప్పుని ప్రజల నెత్తి మీద ఎందుకు రుద్దుతున్నారు? అని ప్రశ్నించారు.
Read Also : పరేషన్ క్రాక్‌డౌన్.. కరీంనగర్ పోలీసులకు షాకిచ్చిన కోర్ట్!
Follow Us On: X(Twitter)

