కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌కు ఉన్న డిమాండ్‌తో కొందరు వ్యక్తులు ఇంధనం అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల (Jadcherla)లో ఇలాగే భారీ ఎత్తున నిల్వ చేసిన డీజిల్ (Diesel)ను అధికారులు సీజ్ చేశారు. జడ్చర్లలోని నాగసాల బంకులో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో బంకుల్లో సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేపట్టారు. నాగసాలలోని ప్రకాశ్ ఫిల్లింగ్ స్టేషన్‌లో 2,700 లీటర్ల డీజిల్‌ను బంకు యజమాని డ్రమ్ముల్లో నిల్వ చేసుకున్నాడు. ఎలాంటి రక్షణ లేకుండా కేవలం ఓ గుడ్డ కప్పి సింటెక్స్ ట్యాంక్, డ్రమ్ముల్లో వాటిని అలాగే వదిలేశాడు. ఈ బంకుకు సమీపంలో ఇటుక బట్టీలు ఉన్నాయని, పక్కనే ఓ పాఠశాల కూడా ఉందని, ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని అధికారులు ప్రశ్నించారు. బంక్ యజమానిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

