రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో కేటీఆర్ ఘాటు ప్రశ్నలు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన, అప్పులపైన అధికార పక్షానికి ఒక ఓరియెంటేషన్ సెషన్ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. ఈ మేరకు రెండోరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడారు. కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని అపవాదుకు గురి చేస్తే, దివాలా తీసిందని దుష్ప్రచారం చేస్తే నష్టపోయేది రాష్ట్రమేనన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కేంద్ర ఆర్థిక సంస్థలు స్పష్టంగా వివరించాయని చెప్పారు. సోషియో ఎకనామిక్ సర్వే కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించి నిజాలను చెప్పిందన్నారు. స్టేట్ ఓన్డ్ టాక్స్ రెవెన్యూస్‌లో దేశంలోనే ఉత్తమ స్థానంలో తెలంగాణను నిలబెట్టింది తమ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. దర్జాగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టామని.. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆదాయం అంచనాలకు అందడం లేదని దుయ్యబట్టారు.

ఒకప్పుడు ఉస్సేన్ బోల్ట్ లెక్క పరిగెత్తిన ఆర్థిక వ్యవస్థ ఈరోజు తెలంగాణలో ఎందుకు చతికిలపడింది? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఆర్థిక చక్రం పూర్తిగా అపసవ్య దిశలో ఎందుకు తిరుగుతున్నదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ మిగులు రాష్ట్రానికి ఎందుకు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తున్నది? అని అడిగారు. కరోనా కాలంలో మాత్రమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉందని.. మళ్ళీ కాంగ్రెస్ కాలంలోనే ఇట్లాంటి పరిస్థితి వస్తోందన్నారు. ఉన్న డే ఎకానమీని ఖరాబ్ చేసి నైట్ ఎకానమీ తీసుకువస్తాం అంటున్నారు.. మీరు తీసుకురానున్నది నైట్ ఎకానమీ కాదు, దారం తెగిన తెలంగాణ కైట్ ఎకానమీ అంటూ దుయ్యబట్టారు.

తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన నాయకత్వం కేసీఆర్ ది అంటూ కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించారు. కానీ ఈరోజు రాష్ట్రం తలసరి ఆదాయంలో 6వ స్థానానికి పడిపోయామని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిందని.. వెహికల్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిందని అన్నారు. జీఎస్టీ గ్రోత్ తగ్గింది. మందు గమనం మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుందని ఎద్దేవా చేశారు. మార్కెట్లో జోరు లేదు, దుకాణాల్లో గిరాకీ లేదు, అంతా నెగటివ్ సెంటిమెంట్ అయిపోయిందన్నారు. సారా దుకాణాలు తెరవాలని డిమాండ్లు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా చూస్తున్నామన్నారు. ఒకప్పుడు నీరో చక్రవర్తి గురించి చూశాము, ఇప్పుడు జీరో చక్రవర్తిని చూస్తున్నాము. ప్రజల ఆస్తులను జీరో వాల్యూ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈయనే ఉన్నారని దుయ్యబట్టారు. ఈ మొత్తం ఆర్థిక వ్యవస్థ ఈ పరిస్థితికి రావడానికి నెగటివ్ మైండ్‌సెట్, నెగటివ్ పాలసీలే ప్రధాన కారణమని విమర్శించారు. టీ-హబ్ సైతం చాయ్ అమ్ముకునే దుకాణం అనుకున్నారో ఏమో తెలియదు కానీ, అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు అందులోకి తరలించాలని ఆదేశాలు ఇచ్చారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రజల ఆర్థిక స్తోమత భారీగా పెరిగింది, కుటుంబ ఆదాయం పెరిగింది, కుటుంబ తలసరి ఆదాయంలో కూడా దేశంలోనే అత్యధిక అత్యుత్తమ స్థానంలో ఉందని గుర్తు చేశారు. కానీ రాష్ట్రం ఈరోజు నాలుగు ఐదు నెలలుగా నెగటివ్ ద్రవ్యోల్బణం చవిచూస్తొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ ప్రచారాలు చేశారని.. కేవలం పొలిటికల్ ప్రాపగాండా కోసం రాష్ట్రాన్ని పతనావస్థకు తీసుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబల్ సమిట్ (Global Summit) అని చెప్పి ఒక గోబెల్స్ కాన్ఫరెన్స్ పెట్టి 5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క పెట్టుబడుల నంబర్‌ని రాసిందని దుయ్యబట్టారు. 100 కోట్ల రూపాయల టెంట్ వేసి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బొమ్మలు చూపించి ప్రచారం చేసుకున్నారని ఫైర్ అయ్యారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరి అందరినీ కోటీశ్వరులుగా చేస్తే కోటి ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రం అవుతుంది. ఎందుకు ఇలాంటి అసత్యాలు, ఆచరణ సాధ్యం కాని మాటలను ఎందుకు చెబుతున్నారు? అని ప్రశ్నించారు. డావోస్‌తో పాటు మొన్న జరిగిన కాన్ఫరెన్స్ అన్నిటి పైన కలిపి ఒక శ్వేతపత్రాన్ని రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల అంశంపైన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము ఫార్మా సిటీ కోసం 14 వేల ఎకరాలను సేకరించామని.. కానీ అక్కడ పాదయాత్ర చేసిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంలోకి రాకముందు ప్రజలకు తిరిగి ఇస్తామని చెప్పారని అన్నారు. కానీ ఈరోజు ప్రభుత్వం అక్కడ గ్రాఫిక్స్ మాయాజాలంతో ఫ్యూచర్ సిటీ పేరు చెప్పి అబద్ధాలు చెప్తోందన్నారు.

ఫార్మా సిటీ భూసేకరణ కేవలం ఫార్మా అవసరాల కోసమే వాడుకోవాలనే నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. అయినా ఇవన్నీ పక్కన పెట్టి కంపెనీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇండ్లు ఇస్తామని చెప్పి అందరినీ ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నది.. ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఇంకొక మోసానికి పాల్పడుతున్నదని ఆరోపించారు. కాలుష్యకారక పరిశ్రమలు వద్దు అని చెప్పి ఆరోజు పోరాటం చేసిన కాంగ్రెస్ నేతలు, ఈరోజు మధ్యలో పరిశ్రమలు పెట్టి ఏ విధంగా ఫ్యూచర్ సిటీని నిర్మాణం చేస్తారు? అని కేటీఆర్ (KTR) ప్రశ్నించారు.

Read Also: కేటీఆర్ డ్రగ్ టెస్టుకు రావాలి.. మండలిలో ఆసక్తికర స్టేట్‌మెంట్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>