కలెక్టర్‌కే టోకరా వేయాలనుకున్న నకిలీ అధికారి.. ఫేక్ ఐడీలతో అడ్డంగా బుక్!

కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి, ఏకంగా ఇంటెలిజెన్స్, ఇంటర్‌పోల్ అధికారుల (Interpol Officer) మని నమ్మించి హల్‌చల్ చేసిన ఇద్దరు వ్యక్తుల గుట్టు రట్టైంది. భూ సమస్యను త్వరగా పరిష్కరించాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నించిన ఈ నకిలీ (Fake) అధికారులను హవేళీ ఘణపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని చీటింగ్ కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌లోని కొత్తపేటకు చెందిన బుక్క సంతోష్‌, అతని స్నేహితుడు శ్రీనాథ్‌ ఒక భూ సమస్య విషయమై సోమవారం మెదక్‌ కలెక్టరేట్‌లో జరుగుతున్న ప్రజావాణికి వచ్చారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ సీసీ వద్దకు వెళ్లిన సంతోష్.. తాను ‘ఇంటెలిజెన్స్ ఇంటర్‌పోల్’ పోలీస్ అధికారినంటూ రెండు ఐడీ కార్డులను చూపించాడు. తన స్నేహితుడి భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని అక్కడి అధికారులపై ఒత్తిడి తెచ్చాడు.

అయితే, సంతోష్ ప్రవర్తన, ఐడీ కార్డులపై అనుమానం వచ్చిన కలెక్టర్ సీసీ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో సంతోష్ అసలు రంగు బయటపడింది. సంతోష్ నకిలీ ఐడీ కార్డులను సొంతంగా సృష్టించుకుని, తాను ఇంటర్‌పోల్ అధికారినంటూ ప్రచారం చేసుకుంటున్నట్లు విచారణలో తేలిందని, నకిలీ ఐడీ కార్డులతో అధికారులను బురిడీ కొట్టించేందుకు యత్నించిన బుక్క సంతోష్, శ్రీనాథ్‌లపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేశామని డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>