ప్రజావాణికి జిల్లా అధికారుల డుమ్మా!

క‌లం, నిర్మ‌ల్‌: ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే నిర్మ‌ల్‌ ప్రజావాణి (Nirmal Prajavani) కార్యక్రమం క్రమంగా తన ప్రాధాన్యతను కోల్పోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాల్సిన కార్యక్రమానికి వారు గైర్హాజరవుతూ.. తమ స్థానంలో కిందిస్థాయి అధికారులను పంపించడం విమర్శలకు తావిస్తోంది. సోమవారం నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి పలువురు జిల్లా అధికారులు హాజరు కాకపోవడంపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలతో వస్తే ఆయా శాఖల జిల్లా అధికారులు లేకపోతే సమస్యల పరిష్కారం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు.

పెండింగ్‌లోనే ప్రజల సమస్యలు

ప్రజావాణికి వచ్చిన అర్జీల పరిష్కారంలోనూ ఆశించిన పురోగతి కనిపించడం లేదు. గత వారం అందిన 63 దరఖాస్తుల్లో కేవలం 19 మాత్రమే పరిష్కారం కాగా, 44 అర్జీలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిలో 43 ఫిర్యాదులపై ఇప్పటికీ చర్య ప్రారంభం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజావాణి ఉద్దేశానికి విరుద్ధంగా ఫిర్యాదుల పరిష్కారం ఆలస్యమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రజలు ఎదురుచూపులు.. మొబైల్స్‌తో అధికారులు బిజీ

ప్రజావాణి సందర్భంగా కొందరు అధికారులు ప్రజల వినతులు వినడంకంటే మొబైల్ ఫోన్లలోనే ఎక్కువ సమయం గడపడం కనిపించింది. కార్యక్రమం ప్రారంభం నుంచి ముగిసే వరకు కొందరు మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూనే ఉండటం ప్రజల్లో అసంతృప్తికి కారణమైంది. ప్రజలు తమ సమస్యలు చెప్పేందుకు వేచి ఉండగా, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది.

ప్రజావాణి ఉద్దేశం నెరవేరాలంటే..?

నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌తో పాటు బైంసాలో కూడా ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రతి వారం సుమారు 60 నుంచి 70, బైంసాలో 10 వరకు అర్జీలు వస్తున్నాయి. అయితే జిల్లా స్థాయి అధికారులు స్వయంగా హాజరై అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటేనే ప్రజావాణిపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>