కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయకుంటే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోవాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులను ఎక్కడికి అక్కడ నిలదీయండి కానీ ఆత్మస్థైర్యం కోల్పవద్దని చెప్పారు. నేడు రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిన హత్యలేనని ఆరోపించారు. రెండేళ్లు రైతన్నలు ధైర్యంగా ఉండాలని.. మళ్లీ కేసీఆర్ వస్తాడని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని పొన్న గ్రామంలో జొన్న పంట కొనుగోలు చేయకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించి మాట్లాడారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న రైతన్న పాండురంగ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ. 3,720 వస్తుందని ఆశించి నెల రోజుల పాటు మార్కెట్ యార్డ్‌లోనే జొన్నల కుప్ప వద్ద ఆయన పడిగాపులు కాశారని.. కానీ ఆఖరికి క్వింటాల్‌కు రూ. 50 లంచం అడిగే దుస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయి ఆఖరికి తన పంట కుప్పపైనే పాండురంగ విషం తాగి చనిపోవడం రాష్ట్ర వ్యవసాయ దుస్థితికి అద్దం పడుతోందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్లు రూ. 500 బోనస్ ఇవ్వకపోగా, ప్రైవేటు మార్కెట్లో రూ. 2,000 కే అమ్ముకునే దయనీయ పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని అన్నారు. పాండురంగ్ కుటుంబానికి ఉన్న రూ. లక్షన్నర రుణంలో ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని ఆయన భార్య కన్నీరుమున్నీరుగా విలపించారని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం మూడుసార్లు రైతుబంధును ఎగ్గొట్టిందని, కనీసం రైతు బీమా ప్రీమియం కూడా కట్టకపోవడం వల్ల దాదాపు 7 వేల క్లెయిమ్స్ పెండింగ్‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాండురంగ్ బాధిత కుటుంబానికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ తరఫున రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందజేశామని చెప్పారు.ప్రభుత్వం తక్షణమే ఆ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి తీరాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రైతుల మరణాలు ఆత్మహత్యలు కావని, ఇవి ముమ్మాటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయించిన ప్రభుత్వ హత్యలేనన్నారు.

