కలం, వెబ్ డెస్క్: రాయదుర్గం భూముల విషయమై తెలంగాణ (Telangana) ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య నెలకొన్న వివాదం కొనసాగుతోంది. SBI తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేగాకుండా ఇక నుంచి ఆ బ్యాంకుతో అన్ని రకాల ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే చేసిన డిపాజిట్లు, ఆపరేట్ అవుతున్న అకౌంట్లను మరో బ్యాంకులోకి మార్చుకునేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే ఇది అంత సులువైన విషయం కాదని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకుతో చేసుకున్న ఒప్పందాలు, ఇతరత్ర ఆర్థిక లావాదేవీలు కొలిక్కి రావడానికి చాలా సమయమే పడుతుందని పేర్కొంటున్నారు.
రాజకీయ ఒత్తిళ్లు కారణమా..!
రాయదుర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ.13.5 కోట్లతో ఎస్బీఐ భూమి కొనుగోలు చేసింది. ప్రస్తుతం దాని విలువ రూ.600 కోట్లుగా ఉంది. రాష్ట్ర అవసరాల నేపథ్యంలో ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని భావించింది. ఇందుకు మరో చోట ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఇందుకు అంగీకరించిన బ్యాంక్.. తరువాత కోర్టుకి వెళ్లడం, విచారణలో భాగంగా తెలంగాణ సర్కారు తీరుపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వ పెద్దలు కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ముందు ఒప్పుకుని, తరువాత నిర్ణయం మార్చుకోవడం వెనుకాల ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా.. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్ర ఏమైనా ఉందా.. అనే అంశంపై ఇంటెలిజెన్స్ వర్గాలతో ఆరా తీయిస్తున్నట్లు తెలుస్తోంది.

