కలం, వెబ్ డెస్క్ : ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులను వీధుల వెంట వెంటాడి వేటాడటం, అక్రమంగా అరెస్ట్ చేయడం అత్యంత హేయమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్యోగాల భర్తీ కోసం నిరసన తెలిపిన యువతపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంపై ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ముందు ఒకే ఏడాది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ‘మెగా నోటిఫికేషన్లు’, ‘జాబ్ క్యాలెండర్’ అంటూ నిరుద్యోగ యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నేడు నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతోందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌తో పాటు అన్ని యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని అనేక రోజులుగా పలు రకాల నిరసన కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో 20 వేలకి పైగా పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ, కేవలం 5 వేల పోస్టులతో చేతులు దులుపుకోవాలని చూడటం అన్యాయమన్నారు. సుదీర్ఘకాలంగా కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నట్టుగా వెంటనే 20,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తూ మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
దిల్‌సుఖ్‌నగర్‌లో హక్కుల కోసం పోరాడి అరెస్టైన నిరుద్యోగ జేఏసీ నేతలను, విద్యార్థులను బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లాఠీలతో నిరుద్యోగుల గొంతు నొక్కాలని చూస్తే ఈ ప్రభుత్వానికి కాలం దగ్గరపడినట్టేనని హెచ్చరించారు. నిరుద్యోగుల ఆవేదనను, వారి న్యాయమైన డిమాండ్లను లాఠీలతో అణచివేయలేరన్నారు.

