కలం, నిజామాబాద్ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి ఏనాటికైనా బీజేపీ మనిషే అని బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ (Banswada) మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన శనివారం పాల్గొన్నారు. రేవంత్ ఏనాటికీ కాంగ్రెస్ మనిషి కాలేడని, ఆయన ముమ్మాటికీ బడే భాయ్ తమ్ముడు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రంలోని మైనారిటీలు, మత రాజకీయాలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి కప్పుకున్న బీజేపీ ముసుగును తొలగించి లోపల ఉన్న బీజేపీ నాయకుడిని గుర్తించాలన్నారు.
అధికారంలో ఉన్నాం కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో వాళ్లకే ఓటు వేయాలని కాంగ్రెస్ చెప్తున్న వాదన అర్థరహితం అని కేటీఆర్ (KTR) విమర్శించారు. అధికారంలో ఉండి గత రెండేళ్లలో ఏం చేశారో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల తరువాత తమ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఖచ్చితంగా పట్టణాలను కాంగ్రెస్ కంటే గొప్పగా గతంలో మాదిరి అభివృద్ధి చేస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మైనారిటీలకు, బీసీలకి భారీ ఎత్తున బడ్జెట్ ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు అయితే కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు పొందిన వాళ్లు మాత్రమే ఆ పార్టీకి ఓటు వేయాలని, మిగిలిన వాళ్లు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రూ. 4000 పెన్షన్, మహిళలకు రూ. 2500, విద్యా భరోసా కార్డు, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం వచ్చిన వాళ్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కేటీఆర్ అన్నారు.
బీఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం :
బాన్సువాడ వెళ్ళే మార్గంలో సదాశివ నగర్ మండలం పద్మాజివాడి క్రాస్ వద్ద కేటీఆర్ కు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బీ ఆర్ ఎస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని కార్యకర్తలు నాయకులు సైతం నూతనోత్తేజం నింపాలని ఏ ఎన్నిక అయిన సరే నియోజకవర్గాల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఎప్పటికపుడు పోరాడుతామన్నారు.. మున్సిపల్ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ కు అండగా నిలవాలని జనాలను కోరారు.
Read Also: అర్ధరాత్రి అబ్బాయిలతో వెళ్లిన గురుకుల విద్యార్థినులు
Follow Us On : WhatsApp


