కలం, వెబ్ డెస్క్: దేశ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ‘స్టార్టప్ స్టేట్’ గా తెలంగాణ ఎదిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కొనియాడారు. దేశ అభివృద్ధికి సీఏల పాత్ర ఎంతో ముఖ్యమని చెప్పారు. ప్రస్తుత దేశ ప్రగతిలో ఛార్టర్డ్ అకౌంటెంట్ల ప్రాధాన్యత పెరుగుతున్నదని తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కాన్వకేషన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భవిష్యత్తు వ్యాపార వాణిజ్య అవకాశాల్లో, దేశ ఆర్థిక ప్రగతిలో సీఏల పాత్ర మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఏల పాత్ర పెరుగుతోంది..
కొత్తగా వచ్చిన టాక్స్ రూల్స్, జీఎస్టీ (GST) వంటి కొత్త పన్నుల వ్యవస్థ వలన ఛార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర, పరిధి వేగంగా పెరుగుతోందని కేటీఆర్ అన్నారు. ఆదాయాలు పెరుగుతున్న కొద్దీ, వ్యాపారాలు పెరుగుతున్న కొద్దీ, పన్నుల చెల్లింపుల్లో పారదర్శకత, అందుబాటులోకి వస్తున్న ఆధునాతన టెక్నాలజీ వంటి అనేక అంశాల వలన సమాజంలో సీఏలకు మరింత అవసరం పెరిగిందని చెప్పారు. కఠినమైన కోర్సును కూడా అత్యంత పట్టుదలతో అధిగమించిన ప్రతి ఒక్క సీఏ విద్యార్థికి కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. ఛార్టర్డ్ అకౌంటెంట్ అంటే కేవలం పరీక్ష పాస్ అవ్వడం మాత్రమే కాదని, తీవ్రమైన ఒత్తిడిని, తీవ్రమైన అనిశ్చితిని తట్టుకొని చదివి, వైఫల్యాలను దాటుకొని ముందుకు సాగడం అని చెప్పారు.
తెలంగాణే టాప్..
సీఏలు కేవలం టాక్స్ రూల్స్ గురించి మార్గదర్శకత్వం చేసేవాళ్ళు మాత్రమే కాదని.. వ్యాపారాలను బలోపేతం చేసేవాళ్ళు అని కేటీఆర్ అన్నారు. 2014 నుంచి 2023 వరకి స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూలు (State Owned Tax Revenues) 37 శాతం పైగా వృద్ధి చెందాయని, ఇది దేశంలోని ఏ ఇతర రాష్ట్రంతో పోల్చుకున్నా అత్యధికమని చెప్పారు. దీనితో పాటు మొత్తం ఆదాయ అభివృద్ధి సుమారు 14 శాతం ఉంటే, అది 24 శాతానికి పెరిగిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం తెలంగాణ ఏర్పడడానికి ముందు రూ.94,000 ఉంటే, 2023 నాటికి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా వంటి రాష్ట్రాలను దాటుకొని రూ.3 లక్షలకు పైగా పెరిగిందని కొనియాడారు. ఈ స్థాయికి చేరుకున్న ప్రతి ఒక్క సిఏకి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్.. తల్లిదండ్రులు చేసిన త్యాగాలను మరవకూడదని అన్నారు.

