కలం, కరీంనగర్ బ్యూరో : ప్రజాప్రతినిధులు, వీఐపీల భద్రతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో పీఎస్ఓలు, బాంబ్ డిస్పోజల్ (BD), డాగ్ స్క్వాడ్ సిబ్బంది అత్యంత అప్రమత్తత, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని కరీంనగర్ (Karimnagar) ఏసీపీ ప్రతాప్ ఆదేశించారు. శనివారం కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలోని తన కార్యాలయంలో ఏఆర్ సిబ్బందితో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రతాప్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రామాణిక విధానాలు (SOPs) కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. విభాగాల వారీగా ఆయన సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. పీఎస్ఓలు (PSOs) వీఐపీల భద్రతనే ప్రథమ కర్తవ్యంగా భావించాలి. ఆయుధాల నిర్వహణ, రూట్ చెకింగ్, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. వీఐపీల ప్రయాణ ప్రణాళికల గోప్యతను కచ్చితంగా పాటించాలి.
బాంబ్ డిస్పోజల్ (BD) స్క్వాడ్:
సాంకేతిక పరిజ్ఞానం, మానసిక దృఢత్వం, సమయస్ఫూర్తితో పనిచేయాలి. ఈ విభాగంలో జరిగే చిన్న పొరపాటైనా తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్త వహించాలి.
డాగ్ స్క్వాడ్:
హ్యాండ్లర్లు తమ శునకాల పట్ల ప్రేమ, ఓపికతో వ్యవహరిస్తూ వాటి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి. “హ్యాండ్లర్ మెదడు – కుక్క ముక్కు” సమన్వయంతోనే ఆపరేషన్లు విజయవంతమవుతాయి. వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణే విజయానికి మూలమని, ప్రజల భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఏసీపీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్ (అడ్మిన్) రజినీకాంత్, ఆర్‌ఎస్‌ఐలు నీలవేణి రాజు, కార్తీక్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

