కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ధీమా వ్యక్తం చేశారు. రెండున్నరెళ్ళ కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశమే లేదన్నారు. తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 20 ఏళ్ళ పాటు అధికారంలోకి రావడం కల్ల అని విమర్శించారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో నంది నగర్‌లోని తన నివాసంలో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీని బలోపేతం చేసే అంశాలపై దిశా నిర్దేశం చేశారు.

అడ్డగోలుగా కాంగ్రెస్ అవినీతి..

రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కమీషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో భూములతో పాటు అనేక మైనింగ్ కుంభకోణాలకు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులే స్వయంగా పాల్పడుతున్న పరిస్థితి నెలకొన్నదన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ అరాచకాలు చూసిన తర్వాత ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ విధంగా ఉంటే.. మరోవైపు బీజేపీ కేంద్రంలో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని మండిపడ్డారు. శుక్రవారం రూ.1,000పైగా పెంచిన గ్యాస్ సిలిండర్ ధరనే ఇందులో ఒక ఉదాహరణగా చెప్పవచ్చని పేర్కొన్నారు. బీజేపీ నిర్వాకం వలన ప్రజలపై నిత్యావసర సరుకుల భారం పెరిగిందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడి నాయకులు అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలనిపిలుపునిచ్చారు.

దొంగ ఓట్లు నమోదు చేయకుండా చూడాలి..

రాష్ట్రంలో త్వరలో జరగనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, తర్వాత జరిగే కమిటీల నిర్మాణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను కేటీఆర్ ప్రస్తావించారు. దీంతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో బిఆర్ఎస్ చురుకైన పాత్ర పోషించాలన్నారు. ప్రతి ఒక్క యువకుడికి, యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించేలా చూడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతోపాటు త్వరలో మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఎన్నికలకు సమయత్తం కావాలన్నారు. పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మంచి విజయాలు నమోదు చేసిన నేపథ్యంలో పార్టీ నేతలకు కేటీఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>