కలం, వెబ్ డెస్క్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కొనియాడారు. రాష్ట్రం ఏర్పడగానే మిషన్ కాకతీయ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 46 వేల చెరువులకు కేసీఆర్ జీవం పోశారని గుర్తు చేశారు. నిర్మల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రైతు గర్జన సభ(Rythu Garjana Meeting)లో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిర్మల్ కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి అని.. సరస్వతి మాత కొలువున్న పుణ్యభూమి ఇది అని పేర్కొన్నారు. తెలంగాణను సాధిస్తానని నిర్మల్ లోనే కేసీఆర్ తొలిసారిగా చెప్పారని అన్నారు.
రైతుల అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేశాం..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కేసీఆర్ అహర్నిశలు కోట్లాడి, రాష్ట్రాన్ని సాదించి.. దశాబ్ద కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధితో పరుగులు పెట్టించారని కేటీఆర్ అన్నారు. మిషన్ కాకతీయను యజ్ఞంలా పూర్తిచేసి.. రాష్ట్రంలోని చివరి ఆయకట్టుకు నీరందించిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో రైతుల అభివృద్ధి కోసం అనుక్షణం పనిచేసిన ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వమని చెప్పారు.
రైతులకు పెట్టుబడి ఇచ్చాం..
దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా రైతులకు పెట్టుబడిగా రైతుబంధు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ (KTR) కొనియాడారు. రైతు చనిపోతే అతని కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం రైతు భీమా పథకం తీసుకొచ్చామని అన్నారు. దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఒక తెలంగాణ మాత్రమేనని చెప్పుకొచ్చారు. కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, తెలంగాణకు హరితహారం, దళిత బంధు, కంటి వెలుగు, మన ఊరు – మన బడి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేశామని చెప్పారు. రాష్ట్రం మళ్ళి అభివృద్ధి దిశగా పరిగెత్తాలంటే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Also Read : మేం ఆడ పులులం.. ట్రోలర్లకు మధుప్రియ వార్నింగ్
Follow Us On: Youtube

