కలం, నల్లగొండ: కార్మిక, కర్షక మైత్రితో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు నిర్వహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.డి. సలీం పిలుపునిచ్చారు. బుధవారం భారత ఆహార సంస్థ హమాలి వర్కర్స్ యూనియన్ (CITU) నల్లగొండ ఆధ్వర్యంలో నవంబర్ 15న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ బైక్ ర్యాలీ (Bike Rally) నిర్వహించారు. సీఐటీయూ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మైసయ్య విగ్రహం, ప్రకాశం బజార్, ఎగ్బాల్ మినార్, మిర్యాలగూడ రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండ పట్టణంలో జరిగే 36వ అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 15న నిర్వహించే బహిరంగ సభలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హశం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు భీమగాని గణేష్, సలివొజు సైదాచారి, ఎఫ్సీఐ హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సుంకరబోయిన వెంకన్న, కోశాధికారి నకరికంటి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, రాజేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.

