శ్రీరామక్షేత్రంలో పుష్కర శోభ.. రూ.348 కోట్లతో అభివృద్ధి పనులు

కలం, ఖమ్మం బ్యూరో: రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భద్రాచలం (Bhadrachalam)లో చేపడుతున్న ఘాట్ల అభివృద్ధి, ఆలయ పరిసరాల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పన పనులను మరింత వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. శ్రీరామక్షేత్రంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చే ఏప్రిల్ (శ్రీరామనవమి) నాటికి పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ​

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు, నూతన గోదావరి పుష్కర ఘాట్ నిర్మాణ పనులను బుధవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్టలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం అభివృద్ధి, పుష్కర ఘాట్ల నిర్మాణానికి రూ. 348.59 కోట్లు విడుదల చేసినందున, అధికారులు నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని ఆమె సూచించారు. దేశ విదేశాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్యం, భద్రత, రవాణా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని తెలిపారు. వీఐపీలకు, సాధారణ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వేర్వేరుగా సౌకర్యాలు, ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కల్పించాలని, అలాగే భక్తుల సౌలభ్యం కోసం డార్మెటరీలు, పుష్కర వనం కోసం అనువైన స్థలాన్ని సేకరించాలని ఆదేశించారు. ​

అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేస్తూ, పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని శైలజా రామయ్యర్ పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు వస్తే కలెక్టర్, సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి తప్ప పనులు మాత్రం ఆపవద్దని తేల్చిచెప్పారు.​ ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఆర్ అండ్ బీ ఈఈ నాగేశ్వరరావు, డీపీవో అనూష, ట్రాన్స్కో ఎస్ఈ మహేందర్, డీఎంహెచ్‌వో తుకారం రాథోడ్, డీఏవో భగవాన్ రెడ్డి, తహశీల్దార్ రవికుమార్, భద్రాచలం సర్పంచ్ పూణేం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>