కలం, వెబ్ డెస్క్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే మంగళవారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. రంగనాథ్ కోర్టుకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించడం గమనార్హం. కోర్టు సమన్లు జారీ చేసినా రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలన్న రంగనాథ్ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం.. స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
శంషాబాద్ ఎమ్మార్వోను కూడా కోర్టులో హాజరుపర్చాలని సైబరాబాద్ సీపీని ఆదేశించింది. ఇదిలా ఉంటే.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన భూ వివాదంపై కూడా రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ కింద నవంబర్ ఏడో తేదీన హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ కోర్టుకు హాజరవుతారా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది.

