కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌ను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేసి, స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రూ.58.85 కోట్లతో నిర్మించిన నూతన ఐటీ టవర్‌ను (IT Tower) మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిధుల కొరతతో నిలిచిపోయిన ఐటీ టవర్ నిర్మాణాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.
యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి పొందేలా ఐటీ సంస్థలను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఐటీ టవర్‌లో టాస్క్ శిక్షణ కేంద్రం, ఇంక్యుబేషన్ హబ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్టీటీ డేటాలో 300 మంది, ఎన్ ల్యాబ్స్‌లో 250 మంది, వైడర్ సాఫ్ట్‌వేర్‌లో 20 సీట్లు, పోస్ట్రిట్ ఏఐలో 50 మందికి ఉపాధి కల్పించేలా సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయని వెల్లడించారు. స్థానిక యువతకు సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆదిలాబాద్‌లో 3 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
తొలివిడతలో 2 వేల ఎకరాలు, రెండో విడతలో మరో వెయ్యి ఎకరాలు సేకరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, భూసేకరణ, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి త్వరలో శంకుస్థాపన చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. గతంలో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
సాంకేతిక, విధానపరమైన సమస్యలను పరిష్కరించి పరిశ్రమ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జి. నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీ శాఖ సెక్రటరీ లు అనుదీప్, శశాంక్, అదనపు కలెక్టర్లు ఎస్. రాజేశ్వర్, ఆర్.ఎస్. చిత్రు, ఎస్పీ అఖిల్ మహాజన్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శివప్రసాద్, ఆర్డీవో జగదీశ్వర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

