కేటీఆర్ ఫోటోతో ఇంటి ఎలివేషన్.. అశ్వారావుపేటలో బీఆర్‌ఎస్ అభిమాని వినూత్న భక్తి!

కలం, ఖమ్మం బ్యూరో: సాధారణంగా ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుంటే ఇంటి ముఖద్వారం పైన, ఎలివేషన్‌పైన వినాయకుడి విగ్రహాన్నో లేదా తమ ఇష్టదైవాల ప్రతిమలనో చెక్కించుకుంటారు. కానీ, భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాకు చెందిన ఓ అభిమాని మాత్రం తన ఇంటిపై తన ‘రాజకీయ దైవం’ చిత్రాన్ని చెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. “భద్రాచలం గుడిలో కోదండరాముడు ఉంటే.. నా గుండెల్లో, నా ఇంటిపై ఆ తారకరాముడు (KTR) ఉన్నాడు” అంటూ  కేటీఆర్ అభిమాని (KTR Fan) తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ వినూత్న ఎలివేషన్ స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

​అశ్వారావుపేట (Aswaraopeta) మండల కేంద్రానికి చెందిన మోటూరు మోహన్ అనే వ్యక్తి ఇటీవల ఒక కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) అంటే మోహన్‌కు విపరీతమైన అభిమానం. ఆ ఇష్టంతోనే, సంప్రదాయాలకు భిన్నంగా తన కొత్త ఇంటి ఎలివేషన్‌పై కేటీఆర్ చిత్రపటాన్ని భారీగా ఏర్పాటు చేయించారు. “నేను పొద్దున ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు, మళ్లీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు నాకు ముందుగా కేటీఆర్ సారే కనిపించాలి. అందుకే రూ. 12 వేలు ఖర్చు చేసి మరీ ఈ ఎలివేషన్‌ను ప్రత్యేకంగా తయారు చేయించాను” అని మోహన్ గర్వంగా చెబుతున్నారు.

​ఇంటి ఎలివేషన్ మాత్రమే కాదు.. ఇటీవల జరిగిన తన ఇంటి గృహప్రవేశ వేడుకల్లోనూ మోహన్ తన అభిమానాన్ని చాటుకున్నారు. పూజా గదిలో దేవుడి పటాలతో పాటు గులాబీ బాస్ కేసీఆర్, కేటీఆర్‌ల ఫోటోలను ఉంచి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ తర్వాత బీఆర్‌ఎస్ పార్టీని సమర్థవంతంగా నడిపించే సత్తా ఒక్క కేటీఆర్‌కే ఉందని, రాబోయే రోజుల్లో ఆయనను తెలంగాణ ముఖ్యమంత్రిగా చూడటమే తన జీవితాశయమని మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రాజకీయ అభిమానం కేవలం మోహన్‌కే పరిమితం కాలేదు.. ఆయన కుటుంబం అంతటికీ పాకింది. మోహన్ కుమార్తె ‘ఇవాంక’కు కూడా కేటీఆర్ అంటే విపరీతమైన అభిమానమని కుటుంబ సభ్యులు తెలిపారు.

తమ ఇష్టనేత కేటీఆర్ ఒక్కసారి తమ అశ్వారావుపేట ఇంటికి వచ్చి, భోజనం చేయాలని మోహన్ కుటుంబం ఎంతగానో ఆశపడుతోంది. నాయకులపై అభిమానంతో ఫ్లెక్సీలు కట్టడం, టాటూలు వేయించుకోవడం చూశాం కానీ.. ఇలా ఏకంగా కట్టుకున్న ఇంటిపైనే లీడర్ బొమ్మను శాశ్వతంగా చెక్కించుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారుతోంది. ఈ గులాబీ అభిమాని ముచ్చట తెలుసుకుని కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి!

Read Also: దేశంలో ఆర్థిక తుఫాన్ రాబోతోంది.. మోదీ విధానాలపై రాహుల్ గాంధీ ఫైర్!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>