కలం, జోగులాంబ గద్వాల : కేటీదొడ్డి మండలం పాగుంట గ్రామంలో (Pagunta Village) పారిశుద్ధ్య కార్మికుడు (Sanitation Worker) తిమ్మప్పపై అదే గ్రామానికి చెందిన నర్సిరెడ్డి అనే వ్యక్తి దాడి చేసినట్లు, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు తిమ్మప్ప సోమవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాష షేక్, జిల్లా ఎస్పీ కార్యాలయంలో, జిల్లా పంచాయతీ అధికారి(డీఎల్పీఓ) కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. ఈ నెల 15న పాగుంట గ్రామంలో నీటి సరఫరా కోసం కుళాయిలు వదులుతుండగా నర్సిరెడ్డి అనే వ్యక్తి అడ్డుకుని కులం పేరుతో దూషిస్తూ దాడి చేసినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనలో చెవి నుంచి రక్తస్రావమై, స్పృహ కోల్పోయినట్లు తెలిపారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో కార్మికుడు పరమేశ్‌ను సైతం బెదిరించారని ఆరోపించారు. గ్రామపంచాయతీ విధులకు ఆటంకం కలిగిస్తూ దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, తమ విధులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇప్టూ జిల్లా అధ్యక్షుడు జమ్మిచేడు కార్తిక్, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

