కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతన వైస్ చైర్మన్ , వీసీ అండ్ ఎండీగా (TGSRTC MD) సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ అనిల్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా సేవలందించిన వై. నాగిరెడ్డిని ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ కమిషనర్గా బదిలీ చేసింది. ఆయన స్థానంలో పోలీస్ శాఖలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల డైరెక్టర్ గా విధులు నిర్వహించిన డాక్టర్ అనిల్ కుమార్ ను ప్రభుత్వం నూతన ఆర్టీసీ ఎండీగా నియమించింది. దీంతో నేడు హైదరాబాద్లోని బస్ భవన్లోడాక్టర్ అనిల్ కుమార్ ఈ కొత్త బాధ్యతలు చేపట్టగా, సంస్థ ఉన్నతాధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సీహెచ్. వెంకన్న, ఎం. రాజశేఖర్, సాలోమాన్ రాజ్, ఖుష్రో షా ఖాన్, ఏ. శ్రీధర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయపుష్పలతో డాక్టర్ అనిల్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు, బస్సుల నిర్వహణ, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, అలాగే వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎండీ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధికి వెన్నెముక అయిన కార్మికులు, ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతామని భరోసా ఇచ్చారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు మరింత మెరుగైన, సురక్షితమైన సేవలు అందించాలని ఆదేశించారు. సమిష్టి కృషితో టీజీఎస్ఆర్టీసీని దేశంలోనే నంబర్ వన్ సంస్థగా తీర్చిదిద్దాలని అధికారులకు అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

