కలం, ఖమ్మం బ్యూరో: “మీరు ఎప్పుడైనా వచ్చి కలువొచ్చు” అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు (Vanama Venkateswara Rao)పై తన ఆప్యాయతను చాటుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రముఖ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు 82వ జన్మదిన వేడుకలు ఆయన స్వస్థలమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆదివారం అత్యంత ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వనమాకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న కేటీఆర్ కు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఫోన్ ద్వారా సంప్రదించి, వనమా వెంకటేశ్వర రావుతో మాట్లాడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వనమాకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయన ఆయురారోగ్యాలతో నిండూనూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. త్వరలో తాను హైదరాబాద్ వచ్చి నేరుగా కలుస్తానని వనమా అనగా.. కేటీఆర్ ఆప్యాయంగా స్పందిస్తూ “మీరు ఎప్పుడైనా వచ్చి కలువొచ్చు” అని బదులిచ్చారు. కేటీఆర్ చూపిన ఈ ఆప్యాయత, ఫోన్ సంభాషణ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.

