కలం, వెబ్‌డెస్క్: పులివెందులలో ఎన్నికల తీరు, వైఎస్ జగన్ వ్యవహారంపై టీడీపీ నేత బీటెక్ రవి (BTech Ravi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పులివెందులకు ఓటు వేసేందుకు వచ్చారా? లేక తన అనుచరులతో గొడవలు సృష్టించేందుకు వచ్చారా? అని నిలదీశారు. జగన్ తన హెలికాఫ్టర్ షెడ్యూల్ తప్పుగా ఇచ్చి ఇప్పుడు పోలీసులు, అధికారులపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ వాళ్లే రిగ్గింగ్ చేసి ఇప్పుడు టీడీపీపై ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు సత్రంపల్లి, వెంకటాపురం, యలమారిపల్లి, భాగ్యరాపురంలో రిగ్గింగ్‌కి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. పోలింగ్ కేంద్రాల్లోకి అక్రమంగా చొరబడి, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు.
పోలింగ్ బూత్‌లోకి తమ ఏజెంట్లను రానివ్వలేదన్నది పచ్చి అబద్దమన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గూండాలతో యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారన్నారు. జగన్ ఓటు వేసేందుకు వచ్చాడా? లేక ప్రెస్‌మీట్ పెట్టి అబద్దాలు ప్రచారం చేయడానికి వచ్చాడా? అని ప్రశ్నించారు. గత 40 సంవత్సరాలుగా రిగ్గింగ్ చేస్తూ గెలిచారని, ఇప్పుడు ప్రజలు తిరగబడేసరికి డ్రామాలు ఆడుతున్నారని కామెంట్ చేశారు. పోలీసులు, అధికారులు, టీడీపీ నేతలపై నిందలు వేస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు ఎన్నికల్లో టీడీపీని ఆదరిస్తారని తమకు సంపూర్ణ నమ్మకం ఉందని రవి స్పష్టం చేశారు.

