కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి భాస్కర్ రెడ్డి

​కలం, కరీంనగర్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీలోకి వివిధ పార్టీల నాయకుల చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలోనే వైఎస్ఆర్ సీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి (Singireddy Bhaskar Reddy) ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేనలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కవిత (Kavitha) ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

భాస్కర్ రెడ్డి చేరడం శుభపరిణామం..

ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ మాట్లాడుతూ జిల్లాలోనే సీనియర్ నాయకుడైన సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీలో చేరడం ఎంతో శుభపరిణామమని కొనియాడారు. కరీంనగర్ జిల్లాలో పార్టీ అభివృద్ధికి నాయకులంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ​రాష్ట్రంలో ఏర్పడిన కరువు కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుత ప్రభుత్వం వారిని పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పట్టింపు లేని ప్రభుత్వ వైఖరిని ప్రజల మధ్య నిలదీసి ఎండగట్టాలని, నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహించాలని ఆమె శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

​కవితమ్మ నాయకత్వంలోనే ప్రజా సంక్షేమం..

​పార్టీలో చేరిన అనంతరం సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో కవితమ్మ మాత్రమే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిజాయితీగా పోరాటం చేస్తున్నారని కొనియాడారు. నేటి రాజకీయ పార్టీలు ప్రజలను గాలికి వదిలేసి, కేవలం అధికారం కోసమే పాకులాడుతున్నాయని విమర్శించారు. ​కవితమ్మ ఒక్కరే నిత్యం రాష్ట్ర సమస్యలు, రైతుల ఇబ్బందులు, మహిళల హక్కులు, యువకుల భవిష్యత్తు, అట్టడుగు వర్గాలకు దక్కాల్సిన న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్నారని చెప్పారు. ఆమె ఆశయాలు, పోరాట పటిమను చూసే తెలంగాణ రక్షణ సేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

​ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా పార్టీ అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్, పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ లింగంపల్లి నాగరాజు, కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ అంకం శివరాణి, రాష్ట్ర నాయకులు పూస్కురి శ్రీకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>