నర్సింగ్ కళాశాలను ప్రారంభించిన‌ ఎమ్మెల్యే బండ్ల

కలం, జోగులాంబ‌ గద్వాల: గద్వాల పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనం, వసతి గృహాన్ని ఆదివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (MLA Bandla Krishna Mohan Reddy) ఆయ‌న‌ సతీమణి బండ్ల జ్యోతితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ​ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే దంపతులు కళాశాల ప్రాంగణమంతా తిరిగి, తరగతి గదులు, విద్యార్థుల వసతులు, మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యాధునిక హంగులతో, ఉన్నత ప్రమాణాలతో కళాశాల భవనాన్ని తీర్చిదిద్దడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గద్వాల, పరిసర ప్రాంతాల విద్యార్థులకు నర్సింగ్ విద్యను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. స్థానికంగానే ఉన్నత స్థాయి నర్సింగ్ విద్య అభ్యసించే అవకాశం కలగడం ఎంతో శుభపరిణామమన్నారు. ​ వైద్య వైద్యసేవల విభాగంలో నర్సింగ్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని, ఈ కళాశాల భవిష్యత్తులో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.​ నర్సింగ్ విద్యార్థులు మదర్ థెరిస్సాను స్ఫూర్తిగా తీసుకుని, రోగులకు, ప్రజలకు దయాగుణంతో మెరుగైన వైద్య సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ​ప్రభుత్వ ఆసుపత్రిలోని ‘స్టాఫ్ నర్స్’ పోస్టుల భర్తీలో ఈ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ​

నర్సింగ్ కళాశాలలో చదువుతూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన విద్యార్థుల జ్ఞాపకార్థం కళాశాలలోని ఒక ల్యాబ్‌కు వారి పేరును కేటాయించాలని సూచించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని, ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ అన్నింటినీ ఒకే ప్రాంగణంలోకి తెచ్చి ప్రజలకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గద్వాల మున్సిపల్ చైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్, జిల్లా సీనియర్ నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, బండ్ల రాజశేఖర్ రెడ్డి, సత్య రెడ్డి, జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ జంబురామన్ గౌడ, ఎల్జీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్, రాజా రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>