కలం, వరంగల్ బ్యూరో: కాజీపేట రైల్వే (Kazipet Railway) మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌పై భారీ ఉత్పత్తి లక్ష్యంతో రైల్వే శాఖ ముందడుగు వేసింది. కాజీపేటలో నిర్మితమవుతున్న రైలు బోగీల తయారీ కేంద్రంలో వచ్చే ఆరేళ్లలో 3,200 నాన్ ఏసీ మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(మెము)కోచ్‌లను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. 2026–27 నుంచి 2031–32 ఆర్థిక సంవత్సరాల వరకు చేపట్టనున్న ఉత్పత్తి ప్రణాళికకు రైల్వే బోర్డు ఆమోదం తెలపడం ఉమ్మడి వరంగల్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది.
ముఖ్యంగా మూడేళ్ల వ్యవధిలోనే 2,400 బోగీల తయారీకి ప్రణాళిక రూపొందించడం ఈ యూనిట్‌పై రైల్వే శాఖ పెట్టుకున్న అంచనాలను స్పష్టం చేస్తోంది. గత నెల 26న రైల్వే బోర్డు డైరెక్టర్ (మెకానికల్ ఇంజినీరింగ్) జయంత్ రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్థిక డైరెక్టరేట్ కూడా ఉత్పత్తి ప్రణాళికకు ఆమోదం తెలిపింది. తొలి ఏడాది పరిమిత స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించి, ఆ తర్వాత దశలవారీగా సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు.
200 మెము రైళ్లకు సరిపడా బోగీలు
కాజీపేట యూనిట్లో తయారయ్యే కోచ్‌లను 16 బోగీల చొప్పున రైలు సెట్లుగా రూపొందించనున్నారు. ఈ లెక్కన 3,200 కోచ్‌లతో 200 మెము (మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలు సెట్లను తయారు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పట్టణాలు, నగరాల మధ్య స్వల్ప, మధ్యస్థ దూరాలకు ప్రయాణికుల రవాణాలో మెము రైళ్లు కీలకంగా మారుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులకు ఇవి ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాజీపేటలో మెము కోచ్‌ల తయారీకి భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం రైల్వే ఉత్పత్తి రంగంలో కీలక పరిణామంగా భావిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్‌కు పారిశ్రామిక ఊతం
కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పూర్తిస్థాయిలో ఉత్పత్తి కార్యకలాపాలు చేపడితే ఉమ్మడి వరంగల్ పారిశ్రామిక రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. బోగీల తయారీకి అవసరమైన విడిభాగాలు, విద్యుత్ పరికరాలు, యాంత్రిక సామగ్రి సరఫరా చేసే అనుబంధ పరిశ్రమలకు అవకాశాలు పెరగనున్నాయి. రవాణా, గోదాములు, నిర్వహణ, ఇతర సేవారంగాల అభివృద్ధికి కూడా దోహదపడే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగే వీలుంది.
ఇప్పటికే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గుర్తింపు పొందిన వరంగల్ ప్రాంతం పారిశ్రామికంగానూ ఎదగాలనే ఆకాంక్ష ఉంది. ఈ నేపథ్యంలో కాజీపేటలో రైలు బోగీల తయారీ యూనిట్ కీలక పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. ప్రకటించిన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడం, అవసరమైన మౌలిక సదుపాయాలు, యంత్రాలు, సిబ్బంది సమకూర్చడం, అనుబంధ పరిశ్రమలను ఆకర్షించడం వంటి అంశాలపై యూనిట్ పురోగతి ఆధారపడి ఉంటుంది. రైల్వే బోర్డు ఆమోదించిన ఉత్పత్తి ప్రణాళిక అమలులోకి వచ్చి నిర్దేశిత లక్ష్యాల మేరకు తయారీ సాగితే కాజీపేటకు రైల్వే రంగంలో ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు ఉమ్మడి వరంగల్ ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త బాటలు పడనున్నాయి.
ఆరేళ్ల ఉత్పత్తి ప్రణాళిక
2026–27 ఆర్థిక సంవత్సరంలో 32 కోచ్‌ల తయారీతో ఉత్పత్తి ప్రారంభం కానుంది. 2027–28లో 368, 2028–29లో 480 కోచ్‌లను తయారు చేయాలని నిర్ణయించారు. ఈ మూడు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి 880 కోచ్‌ల ఉత్పత్తి లక్ష్యం ఉంది. అనంతరం 2029–30లో 960, 2030–31లో మరో 960 కోచ్‌ల తయారీకి ప్రణాళిక సిద్ధం చేశారు. చివరి ఏడాది 2031–32లో 400 కోచ్‌లను ఉత్పత్తి చేయనున్నారు. మొత్తంగా ఆరేళ్లలో 3,200 కోచ్‌ల తయారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో 2030–31 అత్యధిక ఉత్పత్తి సాధించాల్సిన సంవత్సరంగా ఉంది.

