కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తాము అధికారం కోల్పోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియనే కారణమని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పష్టం చేశారు. ఎక్కడైతే టీఎంసీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయో.. అక్కడే ఓట్ల తొలగింపు చాలా ఎక్కువగా జరిగిందన్నారు. దీంతో పాటు కేంద్ర పారామిలటరీ బలగాలు కూడా ఇంటింటికి తిరుగుతూ టీఎంసీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దేశ ప్రజల ఓట్లను దొంగలించే వ్యక్తిగా మారిపోయారన్నారు. తనకు అతడి పేరు కూడా పలకడం ఇష్టం లేదన్నారు. ఈ స్థాయిలో ఓట్లు తొలగించిన వ్యక్తిని ఎలా క్షమించాలని మమతా బెనర్జీ ప్రశ్నించారు. బీహార్ రాష్ట్రంలో సర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ఎన్నో అభ్యంతరాలు చెప్పాయన్నారు. కానీ సమయం దాటి పోయిందని ఈసీ చెప్పిందన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా ప్రతి బూత్ పరిశీలిస్తూ.. ఓట్లు తీసేశారన్నారు.
ఎన్నికల కమిషనర్లు ఎందుకు రక్షణ..
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు ఎలాంటి తప్పు చేసినా వారిని రక్షించే బిల్లును ఎందుకు తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ నిలదీశారు. అంటే వారితో ఏదో తప్పులు చేయించాలనే దురాలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లే కదా.. అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 147 మంది లోక్ సభ, రాజ్యసభల ఎంపీలను బలవంతంగా బయటకు పంపేసి.. ఎన్నికల కమిషనర్లకు రక్షణ కల్పించే బిల్లును పార్లమెంటులో పాస్ చేయించుకున్నారని మండిపడ్డారు.
బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక మొత్తం మారిపోయిందని మమతా బెనర్జీ విమర్శించారు. ప్రతి పోలీస్ స్టేషన్ బీజేపీ పార్టీ ఆఫీస్గా, ప్రభుత్వ కార్యాలయాలు బీజేపీ ఎస్టేట్ ఆఫీసులుగా మారిపోయాయన్నారు. కోల్కతాలో రాత్రి 8 దాటితే ప్రజలు దుకాణాలు కూడా తెరుచుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆలయాల్లో హుండీలను కూడా వదలకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు.

