కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలు రద్దు చేశామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తాజాగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు (BRS Membership Drive) జరుగుతుందని స్పష్టం చేశారు. దాని తర్వాత కమిటీలు వేసి.. తమ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బూత్ స్థాయి నుండి అన్ని స్థాయిల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని వివరించారు. సభ్యత్వ నమోదుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పార్టీ సభ్యత్వం కోసం ప్రతి జిల్లాకు ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడికి ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలాగైతే ధాన్యం కొనుగోలు జరిగిందో.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సమావేశంలో తీర్మానం చేశామని ఆయన వివరించారు. ధాన్యం కొనుగోలుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పంటల కొనుగోళ్లపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వాన్ని నిలదీయాలని.. రైతులకు పూర్తి అండగా నిలవాలని చెప్పారు. పండిన పంటలు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసినట్లు వివరించారు. మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసినట్లు తెలిపారు.
మా ఎంపీలు ఉంటే గట్టిగా మాట్లాడేటోళ్ళు..
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంటులో తెలంగాణ విభజన గురించి తప్పుగా మాట్లాడితే.. ముందుగా ఖండించింది తమ రాజ్యసభ ఎంపీలేనని కేటీఆర్ అన్నారు. సభా ముగిశాక తేజస్వీ సూర్య తనకు ఫోన్ చేశాడని.. తాను మాట్లాడింది మీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నాడని తెలిపారు. ‘మీరు మాట్లాడింది తప్పు’ అని తేజస్వి సూర్యకు గట్టిగా చెప్పానని.. తాము ఖండించిన తర్వాతే ఆయన వివరణ ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ సభ్యులు లోక్‌సభలో ఉండి ఉంటే వెంటనే గట్టిగా మాట్లాడేవారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

