కలం, నిర్మల్: ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 1 నుంచి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు మూడు నెలల బియ్యాన్ని అందజేస్తున్నారు. ఇదే అవకాశంగా భావించిన కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. నిర్మల్ (Nirmal) జిల్లా నుంచి మహారాష్ట్రకు రేషన్ బియ్యం అక్రమ రవాణా మళ్లీ జోరందుకుంది. రేషన్ కార్డుదారుల నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న దళారులు వాటిని గోదాముల్లో నిల్వ చేసి, వాహనాల్లో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఒకేసారి మూడు నెలల బియ్యం అందడంతో కొందరు లబ్ధిదారులు ఆర్థిక అవసరాల కారణంగా తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా స్మగ్లర్లు భారీగా కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారు.
15 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
అక్రమ రవాణాపై నిఘా పెట్టిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం నిర్మల్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న (ఎస్ 18 టీ 2555) వాహనాన్ని తనిఖీ చేశారు. అక్రమంగా తరలిస్తున్న సుమారు 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ అజీబ్ ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లో అప్పగించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తేల్చి చెప్పారు.

