కలం, నాగర్‌కర్నూల్: దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మార్గనిర్దేశం అందిస్తూ దేశానికి అత్యుత్తమ పౌరులను తీర్చిదిద్దుతున్నాయని నాగర్‌కర్నూల్(Nagarkurnool) ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, వట్టెం జవహర్ నవోదయ విద్యాలయ పూర్వ విద్యార్థిని డాక్టర్ గీతాంజలి అన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాల 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వట్టెం (Vattem) జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఇదే నవోదయ విద్యాలయంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివి, ప్రస్తుతం అదే జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేయడం నవోదయ విద్యాలయాలు అందించిన మార్గనిర్దేశానికి నిదర్శనమని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు నవోదయ విద్యాలయాలు గొప్ప వరమని పేర్కొన్నారు. జిల్లాలోని విద్యార్థులు నవోదయ విద్యాలయాల స్థాపన లక్ష్యాలను అర్థం చేసుకుని తమ ప్రతిభను తీర్చిదిద్దుకునే అవకాశంగా వీటిని వినియోగించుకోవాలని సూచించారు. విద్యాలయ ప్రిన్సిపాల్ బి. పూర్ణిమ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దేశ అభివృద్ధిలో నవోదయ విద్యాలయాల పాత్రను డాక్టర్ గీతాంజలి వివరించారు.
ప్రిన్సిపాల్ బి. పూర్ణిమ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం, 10వ, 12వ తరగతి పరీక్షలలో టాప్ ఫలితాలు నమోదు చేయడం, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలలో అధిక సంఖ్యలో నవోదయ విద్యార్థులు విజయం సాధించడం విద్యాలయాల ప్రతిష్టకు నిదర్శనమని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ సుధారాణి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ అన్ని రంగాలలో చురుకుగా పాల్గొంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. కార్యక్రమం ప్రారంభంలో నవోదయ విద్యాలయాల రూపశిల్పి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పేరెంట్స్-టీచర్స్ కౌన్సిల్ ప్రతినిధులు మాట్లాడుతూ.. నవోదయ విద్యాలయాలు తమ పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న కృషిని అభినందించారు. విద్యాలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. చివరగా ముఖ్య అతిథులు, విద్యాలయ సిబ్బందిని ఘనంగా సన్మానించారు.

