కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఎండలు (Extreme Heat) తీవ్రంగా మండుతున్నాయి. సోమవారం ఏకంగా 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడగాలులు విపరీతంగా వీస్తుండటంతో బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఎండ తీవ్రత కారణంగా రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చే వారు తలపై కర్చీఫ్‌లు, టవల్‌లు కట్టుకున్నా వేడి తాకిడిని తట్టుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే, చల్లని పానీయాల అమ్మకాలు భారీగా పెరిగాయి. నీళ్లు, జ్యూస్‌లు, కొబ్బరి బోండాలు, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్‌కు డిమాండ్ పెరిగింది. ఉదయం తొమ్మిది గంటలకే ఎండ భగ్గుమంటోంది.
ఈ నేపథ్యంలో వైద్యులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అవసరం లేకుండా బయటకు రావొద్దని నిజామాబాద్‌కు చెందిన డాక్టర్ భరత్ పవార్ తెలిపారు. దాహం లేకపోయినా తరచూ నీళ్లు తాగాలని సూచించారు. కొబ్బరి నీరు, చెరుకు రసం, పండ్ల రసాలు, నిమ్మరసం తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ నుంచి రక్షణ పొందవచ్చని చెప్పారు. తల తిరగడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని హెచ్చరించారు. ఎండ (Extreme Heat) దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read Also: భారత్ ఫ్యూచర్ సిటీ కేంద్రంగా హైస్పీడ్ రైల్ కారిడార్ హబ్: మంత్రి కోమటిరెడ్డి
Follow Us On: WhatsApp

