కలం, వెబ్ డెస్క్ : రేవంత్ రెడ్డి పేమెంట్ కోటాలో సీటు కొనుక్కున్నాడని.. ఆయన కేవలం రెన్యూవల్ సీఎం మాత్రమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (JAC) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాధర్నాలో కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్‌కు నెలనెలా కప్పం పంపి రేవంత్ తన కుర్చీని కాపాడుకుంటున్నారన్నారు.
ఢిల్లీకి బ్యాగులు మోసుకుంటూ పోయినన్ని రోజులు మాత్రమే సీఎం ఉద్యోగం ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతున్నా ఢిల్లీ హైకమాండ్ మౌనంగా ఉండటానికి కారణం ఇదేనని కేటీఆర్ ఆరోపించారు. ఈ ద్రోహానికి రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని కూడా నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి బామ్మర్దికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకుకే అన్ని కాంట్రాక్టులు దక్కుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చిన నిధులు టెండర్లపై ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

