కలం/ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాలో గూండారాజ్యం నడుస్తోందని, జిల్లాలోని ముగ్గురు మంత్రులూ కమిషన్లకే పరిమితమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. బుధవారం ఖమ్మం వచ్చిన ఆయన.. పార్టీ మద్దతుతో ఎన్నికైన నూతన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని, మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో సమర్థంగా పనిచేసి, మంచి ఫలితాలు రాబట్టారని స్థానిక నాయకులు, కార్యకర్తలను కేటీఆర్ ప్రశంసించారు. అధికార పార్టీ ప్రలోభాలకు, దౌర్జన్యాలకు ఎదురునిలిచారని అభినందించారు. పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సర్పంచ్ పదవులను గెలుపొందడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు పార్టీ భవిష్యత్తుకు ఆశాజనకమన్నారు. కొత్త సర్పంచ్లు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడెనిమిది అసెంబ్లీ సీట్లు కచ్చితంగా గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధికి పనిచేయాలని సర్పంచులకు సూచించారు. పార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడంపై స్పందిస్తూ.. తమ పార్టీ నుంచి ఎంతమంది కార్పొరేటర్లను ఎత్తుకుపోయినా తమను బలహీనపరచలేరని, కొత్తవాళ్లను తయారుచేసుకుంటామని చెప్పారు. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వమని, అందిరినీ మోసం చేసిన ప్రభుత్వమని మండిపడ్డారు. జిల్లా నుంచి కేబినెట్లో డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రులు ఉన్నారని, వీరు కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
హామీల అమలులో రేవంత్ విఫలం..:
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ (KTR) దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీల అమలును గాలికి వదిలేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తిట్లపై ఉన్న శ్రద్ద అభివృద్ధిపై లేదని ధ్వజమెత్తారు. ‘సీఎంకు మాటలు తప్ప చేతలు లేవు. ఇది ప్రాజెక్టులు కట్టలేని దద్దమ్మ ప్రభుత్వం. నదీ జలాలపై సీఎంకు అవగాహనే లేదు. అసలు నీళ్ల గురించే తెలియని ముఖ్యమంత్రిని చూస్తే జాలేస్తోంది’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర నీటి వాటాపై మాట్లాడేందుకు శాసనసభలో సమయం ఇవ్వలేదని ఆరోపించారు.
కేసీఆర్ అప్పులు తెలంగాణ భవిష్యత్తు కోసమే..:
కేసీఆర్ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు తెలంగాణ భవిష్యత్తు కోసమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామాల అభివృద్ది కుంటుపడిందని విమర్శించారు. కోర్ట్ మొట్టికాయలు వేస్తేనే పంచాయతీ ఎన్నికలు పెట్టారని ప్రభుత్వం తీరును కేటీఆర్ ఎండగట్టారు.
Read Also: హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ : పొంగులేటి
Follow Us On : WhatsApp


