కలం, వరంగల్ బ్యూరో : హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ నగరాన్ని కూడా అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధి పై జిల్లాల అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా వరంగల్ ఎయిర్ పోర్ట్ సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ ను పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్, రెవెన్యూ, ఇతర అధికారులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు.
వరంగల్ ఎయిర్ పోర్ట్ తో పాటు అండర్ డ్రైనేజ్ సిస్టం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ వచ్చినప్పుడు 4వేల కోట్ల పైచిలుకు పరిపాలన పరమైన అనుమతులను ఇచ్చారన్నారు. దీనిలో భాగంగా గడచిన వర్షాకాలంలో వరదలు ఎక్కడైతే ఎక్కువగా వచ్చాయో ఆ ప్రాంతంలో భవిష్యత్తు కాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా డ్రైనేజ్ వ్యవస్థను మొదటి దశలో రాబోయే వారం రోజుల్లో టెండర్లను పిలిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా తాగునీటి కోసం సుమారు 570 కోట్ల రూపాయలకు టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ తర్వాత హెల్త్ హబ్ గా వరంగల్ నిలుస్తుందన్నారు. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కొద్ది నెలల్లోనే ఎలా పూర్తి చేయాలని అంశంపై అధికారులతో సమీక్షించినట్లు వెల్లడించారు. వరంగల్ ను హైదరాబాద్ తర్వాత రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని, అదే తరహాలో వరంగల్ పట్టణాన్ని మౌలిక వసతులు కల్పించాలని ఉద్దేశంతో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు వరంగల్ పట్టణం ఉమ్మడి వరంగల్ లో అభివృద్ధిలో ముందంజలో ఉండబోతుందన్నారు. క్రికెట్ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్)ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
19న సీఎం చేతుల మీదుగా మేడారం ఆలయం ప్రారంభోత్సవం :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను మహా అద్భుతంగా రూపు దిద్దుకుంటోందని మంత్రి పొంగులేటి తెలిపారు. మేడారం జాతర ఈనెల 28 నుండి 31 వ తేదీల వరకు జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 18న మేడారం చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారని పేర్కొన్నారు. 19న ఉదయం ఆలయ పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కోట్లాదిమంది భక్తులు దర్శించుకుంటారని పేర్కొన్నారు. ఆదివాసీ గిరిజనులతో పాటు గిరిజనేతరులు కోట్లాదిమంది భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు.
వరంగల్ అభివృద్ధికి సీఎం కృషి : సీతక్క
హైదరాబాద్ తర్వాత వరంగల్ ను అంత పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి పట్టుదలతో వరంగల్ గొప్పతనాన్ని అవసరాన్ని గుర్తించి వరంగల్ ఎయిర్ పోర్ట్ ను తీసుకువస్తున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పై అభిమానానికి, శ్రద్ధకు నిదర్శనం ఎయిర్ పోర్ట్ అని పేర్కొన్నారు. ఇంటి ఇలవేల్పుగా ఆదివాసీలకే కాకుండా గిరిజనేతరులు, కోట్లాదిమంది భక్తుల కొలువుదీరిన దేవతలు సమ్మక్క సారలమ్మలు అని అన్నారు. కొంగు బంగారం లాగా కోరుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి కులము మతము ప్రాంతం అనే భేదాలు లేకుండా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వివిధ వసతులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించిందన్నారు. జాతరను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: రాష్ట్రంలో టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటుకు కృషి : మంత్రి పొంగులేటి
Follow Us On: Youtube


