బాలీవుడ్ అందాల భామ కృతిసనన్(Kriti Sanon)కు అరుదైన గౌరవం లభించింది. ఇప్పటి వరకు ఏ భారతీయ నటికి అందని అవకాశం కృతికి అందింది. అదే.. బెర్లిన్(Berlin)లో నిర్వహించే వరల్డ్ హెల్త్ సమ్మిట్(World Health Summit)-2025లో ప్రసంగించే అవకాశం. ఇప్పటి వరకు భారతీయ నటి ఎవరూ కూడా ఈ సమ్మిట్‌లో ప్రసంగించలేదు. ఆ అవకాశం కృతిని వరించింది. అయితే ఈ సమావేశంలో ప్రసంగించిన కృతి.. మహిళల ఆరోగ్యంపై ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.
మహిళల ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం చాలా ఉందని చెప్పారు. ప్రపంచ జనాభాలో సగం మంది మహిళలు ఉన్నా వారి వైద్యానికి సరిపడా నిధులు ఉండటం లేదన్నారు. ‘‘మహిళల ఆరోగ్యంతో పాటు లింగ సమానత్వం కోసం అధికంగా పెట్టుబడులు పెట్టాల్సిన సమయం వచ్చింది. మహిళల ఆరోగ్యమనేది తేలికగా తీసుకునే విషయం కాదు. మానవాళి భవిష్యత్తుకు మూలస్తంభం లాంటిది మహిళల ఆరోగ్యం’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ ఇండియాకు లింగ సమానత్వవ రాయబారిగా కృతి(Kriti Sanon).. సెప్టెంబర్‌లో ఎంపికయ్యారు.

