కలం, వెబ్ డెస్క్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలను రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడని అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekananda) సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (Raghava Constructions) మైనింగ్‌పై తమ నాయకుడు హరీశ్ రావు మాట్లాడగానే రాత్రికి రాత్రే కేరళ పారిపోయిన వ్యక్తి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మైనింగ్ చర్చ జరుగుతుంటే, సమాధానం చెప్పకుండా సభను వాయిదా వేసి పారిపోయారని అన్నారు. అక్రమ మైనింగ్ చేసినందుకు మంత్రి పొంగులేటి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారమని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడని ఫైర్ అయ్యారు. రెవెన్యూ శాఖ పూర్తిగా అవినీతిలో కూరుకొని పోయిందని విమర్శించారు. కలుగులో పొగ పెడితే ఎలుకలు బయటకు వచ్చినట్లు.. రాఘవ కన్స్‌ట్రక్షన్స్ ఇల్లీగల్ పనులు బీఆర్ఎస్ బయటపెట్టగానే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయటకు వచ్చాడని అన్నారు.
మంత్రి పొంగులేటి మీడియా సమావేశం చూస్తే మంత్రివర్గం మొత్తం అవినీతిలో కూరుకొని పోయినట్లు ఒప్పుకున్నాడని అర్ధం అవుతోందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోయిందని.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వెళ్లి కేరళలో ఏదో ఉద్దరిద్దాం అన్నట్లు వెళ్లారని వివేకానంద (KP Vivekananda) ఎద్దేవా చేశారు. పొంగులేటి బాంబులేటే కాదు, ఇప్పుడు బొంగులేటి అయ్యాడంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు దగ్గర గంటలు గంటలు వెయిట్ చేసిన సంగతి మర్చిపోయినవా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం గంటలు గంటలు వెయిట్ చేసి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నావని ఆరోపించారు. కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నప్పుడు తాను దగ్గర ఉండి చూశానని చెప్పారు.
రాఘవ కన్‌స్ట్రక్షన్స్ పై తమ నాయకుడు హరీశ్ రావు ఆధారాలతో సహ మాట్లాడాడని వివేకానంద అన్నారు. తమది తప్పు అయితే మమ్మల్ని ఉరి తియ్యండి అని సవాల్ విసిరిన వ్యక్తి మా నాయకుడు హరీశ్ రావు అని కొనియాడారు. సవాల్ స్వీకరించలేక రాత్రికి రాత్రే విమానంలో కేరళ పోయిన వ్యక్తి పొంగులేటి అని పేర్కొన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది కాదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని.. పొంగులేటి ఏమో రాఘవ కన్‌స్ట్రక్షన్స్ తమ కుమారుడుది అని అంటున్నాడని చెప్పారు. కుడితిలో పడ్డ ఎలుకలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి అయిందని దుయ్యబట్టారు.
Read Also: వచ్చేది తెలంగాణ ఇంటి పార్టీ: కవిత
Follow Us On : WhatsApp

