కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ (Kothirampur) లో గల డంపింగ్ యార్డు వల్ల నగర ప్రజలకు ప్రాణహాని ఉందని, డంపింగ్ యార్డు శాశ్వత పరిష్కారం చూపని పాలకులపై దశల వారిగా ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎం.ఎల్.మాస్ లైన్, బీఆర్ఎస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల నాయకులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, గుడికందుల సత్యం, జంగిలి ఐలెందర్ యాదవ్, జిందం ప్రసాద్, కొక్కిరాల సత్యారావు వెల్లడించారు. శుక్రవారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ డంపింగ్ యార్డు సమస్యతో ప్రజలేదుకొంటున్న ఇబ్బందులు – శాశ్వత పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ పై సురేందర్ రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బీజేపీ పార్టీకి నగరంలో అధికారం అప్పగిస్తే నెల రోజుల్లో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరిస్తామని కేంద్ర మంత్రులు ప్రగల్బాలు పలికి, ఆ సమస్యను గాలికి వదిలేసారని మండిపడ్డారు. నగరానికి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ హుజురాబాద్ డంపింగ్ యార్డ్ పై ఉద్యమం చేస్తున్నారు తప్ప, కరీంనగర్ లో ఎందుకు డంపింగ్ యార్డ్ తొలగించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరు కరీంనగర్ కు చెందినవారే అయినప్పటికీ, వారు ప్రజల ఆరోగ్య పరిస్థితులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రోజు డంపింగ్ యార్డ్ వద్ద రావణకాష్టం లాగా దట్టమైన పొగ మంటలు వస్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాల గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
కోతిరాంపూర్ డంపింగ్ యార్డ్ వల్ల ప్రధానంగా కోతి రాంపూర్, అల్కాపురి, లక్ష్మీ నగర్, కట్టారాంపూర్, హనుమాన్ నగర్, గణేష్ నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని, వృద్ధులు చిన్న పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, అస్తమా ఉన్న వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అన్నారు. పేరుకే స్మార్ట్ సిటీగా ఉన్న కరీంనగర్ లో ప్రస్తుతం తీవ్ర దుర్గంధం వెలువడుతుందని, కాలుష్యం కలుషితం అవుతుందన్నారు. సుదూర ప్రాంతాల చెత్తను కూడా కోతి రాంపూర్ లోగల డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్నారని, దీని ద్వారా లుష్యం మరింత కలుషితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
డంపింగ్ యార్డ్ తరలింపు పై, దీర్ఘ కాలిక పరిష్కారం కోసం, ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం ఐక్యంగా ప్రజల భాగస్వామ్యంతో పోరాటాలు నిర్వహిస్తామని, త్వరలో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కోసం కలిసి వచ్చే రాజకీయ పార్టీలు,స్వచ్ఛంద సంస్థలతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సురేందర్ రెడ్డి,సత్యం,ఐలేందర్ యాదవ్,ప్రసాద్,సత్యారావు లు తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ , సీపీఎం నగర కార్యదర్శులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, గుడికందుల సత్యం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలేందర్ యాదవ్, సీపీఐ ఎం.ఎల్.మాస్ లైన్ జిల్లా నాయకులు జిందం ప్రసాద్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నగర అధ్యక్షులు కొక్కిరాల సత్యారావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, టేకుమల్ల సమ్మయ్య, కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బీర్ల పద్మ, కొట్టె అంజలి, బూడిద సదాశివ, నాయకులు బాకం ఆంజనేయులు, నాయిని సురేష్ తదితరులు పాల్గొన్నారు.

