కలం, ఖమ్మం బ్యూరో: రానున్న గణేష్ ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్(Khammam CP) సునీల్ దత్ (Sunil Dutt) తెలిపారు. శనివారం పోలీస్ అధికారులతో నిర్వహించిన ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీ సునీల్ దత్ మాట్లాడారు. గణేష్ విగ్రహాల ఊరేగింపుల్లో అధిక శబ్దం చేసే డీజేల వినియోగం, రెచ్చగొట్టే నినాదాలు, మద్యం సేవించి శోభాయాత్రల్లో పాల్గొనడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
పండుగల సమయంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే అవకాశం ఉన్న రౌడీషీటర్లు, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. వారి కదలికలు, పరిచయాలు, వివాదాలకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు సేకరించాలని ఆదేశించారు. అవసరమైన సందర్భాలలో ముందస్తు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిమజ్జనానికి ట్రాఫిక్ ప్రణాళిక
గణేష్ నిమజ్జన సమయంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున రద్దీ ప్రాంతాలలో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీలు పోలీస్ శాఖకు సహకరించాలని సీపీ సునీల్ దత్ కోరారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రలను ప్రశాంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

